లక్ష్యం 3 లక్షలు.. చేరుకున్నది 5 లక్షలు

by Shyam |
18 plus vaccine in Hyderabad
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్​ విపరీతమైన వేగంతో ముందుకు వెళ్తున్నది. సీఎం కేసీఆర్​ సూచించినట్టు ప్రతీరోజు 3 లక్షలు లక్ష్యాన్ని పెట్టుకొగా.. శనివారం ఏకంగా రికార్డు స్థాయిలో 5.27 లక్షల డోసులను పంపిణీ చేసినట్టు ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు జరిగిన పంపిణీలో ఇదే గరిష్ఠం కావడం గమనార్హం. 100 శాతం వ్యాక్సినేషన్​ ను అధికారులు చేస్తున్న శ్రమ అంతా ఇంతా కాదు. ఆశావర్కర్​ నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతీ ఒక్కరూ అద్భతంగా పనిచేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ఎక్కడికక్కడే టీకాలు ఇస్తున్నారు. ఈ ప్రక్రియను స్పీడప్​ చేసేందుకు యువత ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. దీంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యమవుతున్నారు. దీంతో గ్రామాల్లో కూడా టీకాపై అవగాహన పెరిగిందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

మహిళల్లో తగ్గిన పంపిణీ..

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,16,33,064 మందికి డోసులు ఇవ్వగా.. వీరిలో 1,56,35,689 మంది తొలి, 59,97,375 మంది రెండో డోసునూ తీసుకున్నారు. అయితే పురుషులతో పోల్చితే మహిళల్లో వ్యాక్సిన్​ వేసుకున్న వారి సంఖ్య కాస్త తక్కువగా ఉన్నది. ఇప్పటి వరకు 1,11,33,399 మంది పురుషులు, 1,04,95,633 మంది వ్యాక్సిన్​ వేసుకున్నట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. వివిధ రకాల హెల్త్​ కాంప్లికేషన్లు, రూరల్​ ఏరియాల్లోని మహిళలకు అవగాహన లేకపోవడంతో ఆ కేటగిరిలో తగ్గినట్టు అధికారులు వివరిస్తున్నారు.

Advertisement

Next Story