డాక్టర్ కక్కుర్తి.. అనుమతి లేకున్నా కరోనా ట్రీట్మెంట్

by Sumithra |   ( Updated:2023-05-19 06:44:10.0  )
డాక్టర్ కక్కుర్తి.. అనుమతి లేకున్నా కరోనా ట్రీట్మెంట్
X

దిశ, నర్సంపేట: అనుమతి లేకుండా కరోనా చికిత్స చేసి ఓ కుటుంబానికి పెద్ద దిక్కును దూరం చేసిన సంఘటన నర్సంపేట పట్టణంలోని పాకాల సెంటర్‌లోని ఎల్ ఎన్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. చివరి నిమిషంలో అంబులెన్స్‌లో హుటాహుటిన బాధితుణ్ణి వరంగల్‌కి తరలించడంతో వెళ్లిన కొద్ది సేపటికే అతడు మృతి చెందాడు. ఆగ్రహంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు నర్సంపేటలోని ఎల్ ఎన్ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

ఇదీ జరిగింది…

చెన్నారావుపేట మండలానికి చెందిన ముద్దునూర్ అశోక్ (40) అనే వ్యక్తి ఎలక్ట్రిషియన్ పని చేసేవాడు. ఈ నెల 4న శ్వాస సమస్యతో ఎల్ ఎన్ ఆస్పత్రిలో చేరాడు. అతన్ని పరీక్షించిన డాక్టర్ మార్త రాజు అతన్ని వెంటనే అడ్మిట్ కావాలని, నాలుగు రోజుల్లో కరోనా తగ్గిపోయేలా చికిత్స చేస్తానని నమ్మబలికాడు. నాలుగు రోజుల పాటు రోజుకు ముప్పైవేలు బిల్లు, మెడిసిన్ ఖర్చులు దీనికి అదనంగా కట్టించుకున్నాడు. ఆదివారం సాయంత్రం దాదాపుగా తగ్గిపోయిందని, శ్వాస సమస్య లేదని కుటుంబీకులకు చెప్పారు. సోమవారం ఉదయం అశోక్ పరిస్థితి అకస్మాత్తుగా విషమిస్తోందని ఆస్పత్రి సిబ్బందే ఓ అంబులెన్స్ లో వరంగల్ లోని రోహిణీ ఆస్పత్రికి తరలించారు. వెళ్లిన కొద్ది సేపటికే పరిస్థితి విషమించి అశోక్ మృతి చెందాడు.

ఆస్పత్రి ఎదుట ఆందోళన

నర్సంపేట పట్టణంలోని పాకాల సెంటర్‌లో గల ఎల్ ఎన్ ఆస్పత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు, మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే అశోక్ మృతి చెందాడని ఆరోపిస్తూ ఆస్పత్రి సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు.

రెండ్రోజుల ముందే నోటీసులు..

కరోనా చికిత్స చేయడానికి అనుమతి తప్పనిసరి. నర్సంపేట పట్టణంలో అనుమతి లేకుండానే కరోనా చికిత్స చేస్తున్నారన్న సమాచారంతో రెండు రోజుల కిందటే ఆస్పత్రిని జిల్లా వైద్య అధికారులు పరిశీలించారు. కరోనా చికిత్స చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించినట్లు సమాచారం. డబ్బుల కోసం అనుమతి లేకున్నా.. చికిత్స చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్న ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed