- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా కథలు.. తండ్రి ప్రేమకు దూరమైన చిన్నారులు…
దిశ, పరిగి : కరోనా రక్కసి అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. తండ్రి ప్రేమను తెలుసుకునే పసి మొగ్గలకు నాన్న లేడని, తిరిగి రాడన్న చేదు నిజం తెలియక చిన్నారులు ఇంకా నాన్నకోసం ఎదురు చూస్తేనే ఉన్నారు. నాన్న ఎప్పుడొస్తాడంటూ వచ్చీరాని మాటలతో చిన్నారులు అడుగుతుంటే ఏంచెప్పాలో అంటూ కన్నీళ్లు కారుతున్న కళ్లను తుడుచుకుంటూ, బాధను దిగమింగుకుంటూ తన పిల్లలకు అన్నీతానై గుండెలకు హత్తుకుంటూ తల్లడిల్లుతున్న ఓ తల్లి.. దీన గాధ
వికారాబాద్ జిల్లా పరిగి డివిజన్ కుల్కచర్ల మండలం బండవెన్కిచర్ల గ్రామానికి చెందిన చాకలి హన్మమ్మ–బిచ్చమ్మల మూడో కొడుకు మల్లేష్. మల్లేష్ పెద్దగా చదువుకోకపోవడంతో తండ్రికి ఆసరాగా ఉంటూ వారికున్న రెండెకరాల పొలం సాగుచేసుకుంటూ ఇతరుల వద్ద కూలీ పనికి వెళ్లేవాడు. మల్లేష్ కొన్నేళ్ల క్రితం శివలీలతో వివాహం జరిగింది. వీరికి నీతీష్, అశ్విత ఇద్దరు పిల్లలు ఉన్నారు. అల్లారు ముద్దుగా పిల్లలను చూసుకుంటూ ఉన్నారు.
భయంతోనే మృత్యు ఒడిలోకి…
నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని కడు పేదరికం. మల్లేష్‌కు గత నెల మే 15న జ్వరం రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో మూడు రోజులు వైద్యం చేయించుకున్నాడు. అయినా జ్వరం తగ్గకపోవడంతో కుల్కచర్ల ప్రభుత్వాస్పత్రిలో మే 18వ తేదీన కొవిడ్ పరీక్ష చేయించుకున్నాడు. పాజిటివ్ అని తేలింది. హోం క్వారైంటైన్‌లో ఉండి, మందులు వాడితే సరిపోతుందని వైద్యులు తెలిపారు. ఇంటి వచ్చి తనకు కరోనా వచ్చిందని భయంతో కుటుంబీకులకు చెప్పాడు. ఏం కాదని తగ్గిపోతుందని మల్లేశ్ అన్న ధైర్యం చెప్పాడు. రాత్రి నిద్రపోయే ముందు కరోనా సోకిందంటూ మరోమారు భార్యకు చెప్పి బాధపడ్డాడు. భార్య కూడా లోలోపల భయపడుతున్నా భర్తకి మాత్రం ధైర్యం చెప్పింది.
అందరూ ధైర్యం చెప్పినా భయపడుతూనే నిద్రపోయిన మల్లేష్ తెల్లారేసరికి మృత్యు ఒడికి చేరుకున్నాడు. తన భర్తను లేపే ప్రయత్నం చేసిన భార్యకి మల్లేష్ చనిపోయాడని తెలియడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు అయ్యోపాపం.. అంటూ విచారం వ్యక్తపరిచారు. పాతికేళ్లు కూడా నిండకుండానే పతిని కోల్పోయిందని. నాన్న అంటూ అప్పుడప్పుడే పిలిచే పిల్లలకు ఆ పిలుపు దూరమడం విధి వక్రీకరించడమేననుకున్నారు. భర్తను కోల్పోయి ఇద్దరు పిల్లలతో దిక్కులేని స్థితిలో ఉన్న శివలీలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆపన్న హస్తం కోసం ఆ పేద కుటుంబం ఎదురు చూస్తుంది.