కరోనా రోగి మృతదేహం పీక్కుతిన్న కుక్కలు

by Anukaran |   ( Updated:2020-08-08 12:05:18.0  )
కరోనా రోగి మృతదేహం పీక్కుతిన్న కుక్కలు
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కరోనా ఎన్నో కుటుంబాల్లో ఆత్మఘోషను మిగులుస్తోంది. కరోనాతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణిస్తున్న వారి మృతదేహాలను ఖననం చేసే విషయంలో పురపాలక శాఖ పూర్తిగా విఫలం అవుతుందోన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా రోగి మృతదేహంను కుక్కలు పీక్కు తినడం ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. తాజాగా జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో ఆదిలాబాద్‌లోని రిమ్స్ దవాఖానాలో మృతి చెందాడు.

అంతులేని నిర్లక్ష్యం

రిమ్స్‌లో మృతిచెందిన కరోనా బాధితుల అంత్యక్రియల విషయంలో పురపాలక శాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మృతదేహాలను కుటుంబ సభ్యులకు లేదా మున్సిపల్ అధికారులకు అప్పగిస్తూ వస్తున్నారు. తాజాగా శుక్రవారం మృతి చెందిన ఆదిలాబాద్‌కు చెందిన ఓవ్యక్తి మృతదేహాన్ని రిమ్స్ యంత్రాంగం పురపాలక శాఖ అధికారులకు అప్పగించారు. కొద్ది రోజులుగా మృతదేహాలను జిల్లా కేంద్రానికి సమీపంలోని పొన్నారి పొలిమేరల్లో దహనం చేస్తున్నారు. అయితే పూర్తిగా దహనం కాకుండానే వదిలేసి వెళ్లిపోయారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే స్మశానంలోకి వచ్చిన కుక్కలు శవాన్ని పీక్కు తినడం గ్రామస్తులు కంటపడింది. దీనిపై అధికారులకు సమాచారం కూడా ఇచ్చారు. అయినప్పటికీ యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీన్ని వీడియోలో చిత్రీకరించిన కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ పరిణామం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.

అధికారుల స్పందన ఇలా..

ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేందర్ మాట్లాడుతూ.. కరోనా రోగి మృతి చెందితే శవాలను మున్సిపల్ అధికారులకు అప్పగించడం వరకే తమ పని అని చెప్పారు. ఇదే విషయమై ఆదిలాబాద్ మున్సిపల్ సహాయ కమిషనర్ రాజు సమాధానం ఇస్తూ.. ఈ వ్యవహారం తమ దృష్టికి రాలేదని చెప్పడం కొసమెరుపు.

Advertisement

Next Story

Most Viewed