కరోనా వైరస్ పల్లెబాట

by vinod kumar |
కరోనా వైరస్ పల్లెబాట
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్‌తో ఒక మేరకు కట్టడి అయిందనుకున్న కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడు ఆంక్షల సడలింపుతో మళ్ళీ ఉధృతమవుతోన్నది. వందే భారత్, శ్రామిక్ ఎక్స్‌ప్రెస్, విమాన సర్వీసులు, అంతర్ రాష్ట్ర వాహనాల రాకపోకలతో కొత్త కేసులు పెరుగుతున్నాయి. పట్టణాల నుంచి వైరస్ పల్లెలకు పాకుతోన్నది. తెలంగాణలో మే 1 నుంచి 27 వరకు 297 కేసులు నమోదయ్యాయి. ఇందులో 173 ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లు, ప్రైవేట్ వాహనాల ద్వారా వచ్చిన వారైతే మిగిలిన 124 మంది ఇతర దేశాల నుంచి విమానాల ద్వారా వచ్చినవారు. వీరికి రైలు, విమానం ఎక్కేటప్పుడు ఎలాంటి లక్షణాలు లేవు. తెలంగాణకు చేరుకున్న తర్వాత సైతం అవి కనబడలేదు. కానీ, క్వారంటైన్ పీరియడ్‌లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఈ 297 మంది ఎక్కువగా గ్రామాల్లోనే ఉన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, సిరిసిల్ల, జనగాం, వరంగల్ రూరల్, యాదాద్రి-భువనగిరి, నల్లగొండ తదితర జిల్లాల్లోనే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. మార్చి 3వ తేదీన అధికారికంగా తొలి వైరస్ కేసు నమోదైనప్పటి నుంచి నిన్న మొన్నటి వరకూ యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు సైతం నమోదుకాలేదు. కానీ, శ్రామిక్ ఎక్స్ ప్రెస్ రైళ్లు మొదలైన తర్వాత ఆ జిల్లాలో ఏకంగా 33 పాజిటివ్ కేసులు వచ్చాయి.

సడలింపే వైరస్ వ్యాప్తికి కారణం

లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు తర్వాత వైరస్ వ్యాప్తిని అరికట్టడం సవాలుగా మారింది. పద్నాలుగు రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలన్న నిబంధనతో పాజిటివ్ కేసులు బైటకొస్తున్నాయి. జిల్లా స్థాయి అధికారుల వివరాలను పరిగణనలోకి తీసుకుంటే యాదాద్రి-భువనగిరి జిల్లాకు 2,300 మంది వలస కార్మికులు వస్తే అందులో 33 మందికి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. జగిత్యాల జిల్లాలో సుమారు 5200 మంది వస్తే 30 మందికి పాజిటివ్‌ వచ్చింది. మంచిర్యాల జిల్లాకు 2500 మంది వస్తే అందులో 27 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 8900 మంది వస్తే అందులో 66 పాజిటివ్‌గా తేలాయి. ఇందులో జగిత్యాల జిల్లాలో 54, సిరిసిల్లలో 12 చొప్పున ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 23, నిర్మల్ జిల్లాలో 23, ఆసిఫాబాద్ జిల్లాలో ఐదుగురు వలస కార్మికులకు కరోనా వచ్చింది. వీరి ద్వారా వైరస్ పల్లెలకు వచ్చినట్టు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాకు మహారాష్ట్రలోని భీవండి, షోలాపూర్ లాంటి ప్రాంతాల్లో నూలు, కాటన్ మిల్లుల్లో కూలీ పనిచేసే తెలంగాణ ప్రజలు ఇప్పుడు సొంతూళ్లకు చేరుకున్నారు. ఈ ఒక్క జిల్లాలో 29 మందికి పాజిటివ్ వచ్చింది. వీరంతా పల్లెల్లో ఉంటున్న వారే. జన్నారం గ్రామంలోనే 12 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ ఊరి ప్రజల్లో ఆందోళన నెలకొంది. సిరిసిల్ల పట్టణంలో వచ్చిన పాజిటివ్ కేసులు సైతం ఎక్కువగా చేనేత కార్మికులవే. వేలాది మంది బతుకుతెరువు కోసం ముంబాయి, షోలాపూర్, భీవండి, థానె, సూరత్ లాంటి నగరాల్లో పనిచేస్తుండేవారు.

ఇది తెలంగాణకు సమస్య మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలదీ ఇదే పరిస్థితి. కేంద్ర వైద్యారోగ్య సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఇటీవల మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. బీహార్ రాష్ట్రానికి చెందినవారు చాలా నగరాల్లో కూలీ పని చేసుకుంటున్నారని, ఇప్పుడు సొంతూళ్లకు చేరుకుంటుండడంతో పాజిటివ్ కేసులు పెరిగాయని తెలిపారు. గుజరాత్‌లో 158, బీహార్‌లో 249, మహారాష్ట్రలో 181, రాజస్థాన్‌లో 2,045, కేరళలో సుమారు 400, ఉత్తరప్రదేశ్‌లో 1,230, ఒడిషాలో 65.. ఇలా అన్ని రాష్ట్రాల్లో ఒక్క రోజు వ్యవధిలోనే ఈ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైనట్టు వివరించారు. ఇలా వేలు, లక్షల్లో కార్మికులు సొంతూర్లకు చేరుకుంటున్నారని, వీరిలో లక్షణాలున్నవారికి పరీక్షలు నిర్వహిస్తే సగటున 20శాతం మేర పాజిటివ్ తేలిందని పేర్కొన్నారు. కొందరిలో లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్ ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వమే పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది.

వలసల పాజిటివ్ కేసులకు సపరేట్ లెక్క

తెలంగాణ, తమిళనాడు లాంటి రాష్ట్రాలు ప్రతీరోజూ విడుదల చేసే బులెటిన్‌లలో ఏకంగా వలస కార్మికుల సపరేట్ కాలమ్ పెట్టి ఏ రోజు ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చాయో వెల్లడిస్తున్నాయి. దీన్ని బట్టి వలస కార్మికుల ద్వారా వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు 91 లక్షల మందిని శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా సొంతూర్లకు తరలించినట్టు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం గురువారం వివరాలను అందించింది. అయితే ఇలా వెళ్లినవారిలో లక్షణాలున్నవారిని పరీక్షిస్తే సగటున 20శాతం మేర పాజిటివ్ ఉన్నట్లు వివిధ రాష్ట్రాల గణాంకాలు తెలియజేస్తున్నాయి.

పల్లెల్లో జర భద్రం: వైద్యారోగ్య శాఖ

ప్రజలు ఒక చోటి నుంచి మరో చోటికి ప్రయాణం చేస్తూ ఉండడంతో వైరస్ వ్యాప్తి పెరుగుతుందని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముందుగానే అంచనా వేసింది. అందుకే అప్రమత్తంగా ఉండాల్సిందిగా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ నెల 23వ తేదీన ఒక లేఖ రాశారు. ప్రతి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగినంత సంఖ్యలో ఫింగర్ టిప్ పల్స్ ఆక్సీమీటర్లు, ఎన్-95 మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, నీటి వసతి సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. క్వారంటైన్‌లో ఉన్నవారి ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు ఏఎన్ఎంలు, నర్సుల ద్వారా తెలుసుకుంటూ జిల్లా వైద్యాధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని, రాష్ట్ర డ్యాష్‌బోర్డుకు అప్‌లోడ్ చేస్తూ ఉండాలని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed