పరకాల ఎమ్మెల్యేపై దొంగముద్ర.. హోరెత్తిన నినాదాలు

by Shyam |   ( Updated:2023-03-20 19:01:00.0  )
Parakala MLA Challa Dharma Reddy
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డికి నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల నుంచి తీవ్ర వ్యతిరేక స్వరం వినిపిస్తోంది. ప‌ర‌కాలను అమ‌ర‌వీరుల జిల్లాగా ఏర్పాటు చేయాల‌నే డిమాండ్ ప్రజానీకం నుంచి బ‌లంగా వినిపిస్తున్నా.. ఎమ్మెల్యే ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తిట్టిపోస్తున్నారు. జిల్లా సాధ‌న‌కు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నా.. ఎమ్మెల్యే ఒక దొంగ‌ మాదిరి త‌ప్పించుకుంటూ తిరుగుతున్నాడని సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ప‌ర‌కాల అమ‌ర‌వీరుల జిల్లా సాధ‌న‌ జేఏసీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో గతవారం రోజులుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ పార్టీల నాయ‌కుల‌తో పాటు వివిధ సంఘాల నేత‌లు జేఏసీలో భాగ‌స్వాములై ఉద్యమం చేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమంది అమ‌రుల‌య్యార‌ని, వారి త్యాగాల‌కు గుర్తుగా ప‌ర‌కాల ప‌ట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాల‌నే డిమాండ్ చేస్తూ ఉద్యమం చేప‌డుతున్నారు. ప‌ర‌కాల‌ జిల్లా కేంద్రమైతే ఈ ప్రాంత ప్రజ‌ల‌కు ప‌రిపాల‌న మ‌రింత చేరువ కావ‌డంతో పాటు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు, మౌలిక స‌దుపాయాలు పెర‌గ‌డంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల మంజూరు పెరుగుతుంద‌ని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Parakala-people

ఎమ్మెల్యేకు ప‌ట్టింపు లేదా..?

పూర్వంలోనే తాలుఖాగా వ‌ర్ధిల్లిన ప‌ర‌కాల ప‌ట్టణాన్ని పాల‌కులు నిర్లక్ష్యం చేయ‌డంతో పాటు అభివృద్ధి చెంద‌లేద‌ని స్థానిక నేత‌లు ఆరోపిస్తున్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ‌లోనైనా అభివృద్ధి చెందుతుంద‌ని ఆకాంక్షిస్తే నిరాశే ఎదుర‌వుతోంద‌ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం చేయ‌డానికి అన్ని అర్హతలు క‌లిగి ఉన్నా.. ప‌ర‌కాల‌పై రాష్ట్ర ప్రభుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డంపై నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజ‌ల ఆకాంక్షను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి లేకుండా పోయిందని మండిపడుతున్నారు. పొరుగు జిల్లాలో జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌పై ఉన్న ఆస‌క్తి.. సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని ప్రజ‌ల ఆకాంక్షలను నెర‌వేర్చడంపై లేదని విమ‌ర్శిస్తున్నారు.

క‌నిపించ‌ని ఎమ్మెల్యే ప్రయ‌త్నం..

పరకాలను జిల్లాగా ఏర్పాటు చేయాల‌న్న ప్రజ‌ల‌ బ‌ల‌మైన ఆకాంక్షను నెర‌వేర్చడానికి ఎమ్మెల్యే ధ‌ర్మారెడ్డి నుంచి క‌నీస ప్రయ‌త్నం క‌నిపించ‌డం లేద‌ని జేఏసీ నేత‌ల‌తో పాటు సొంత పార్టీకి చెందిన నేత‌ల నుంచే విమ‌ర్శలు వ్యక్తమ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం. ఎమ్మెల్యేకు ప‌ర‌కాల‌ను హ‌న్మకొండ‌లో క‌ల‌ప‌డంపైనే ఆస‌క్తి ఉంద‌ని, కేవ‌లం రాజ‌కీయ స్వార్థం కోస‌మే జిల్లా సాధ‌న ఉద్యమానికి మ‌ద్దతు తెల‌పకుండా ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్యటిస్తూ సొంత నియోజ‌క‌వర్గ ప్రజ‌ల‌కు అన్యాయం చేస్తున్నార‌న్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed