కాడెత్తేసిన కాంగ్రెస్..​అంతా సైలెంట్..!​

by Anukaran |   ( Updated:2021-11-12 10:37:59.0  )
Congress
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వరి రాజకీయం హోరెత్తుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరసనలకు దిగుతున్నాయి. జిల్లా కలెక్టరేట్ల ముందు బీజేపీ ఆందోళనకు దిగితే.. మండలాలు, నియోజకవర్గాల నుంచి రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్​ధర్నా చేసింది. కానీ ఇలాంటి అవకాశాన్ని చేజిక్కించుకోవాల్సిన కాంగ్రెస్​పార్టీ మాత్రం సైలెంట్‌‌గా వ్యవహరిస్తోంది. రైతు సమస్యలను అందిపుచ్చుకుని రెండు పార్టీలను నిలదీస్తూ నిరసనలకు దిగాల్సిన సమయంలో చేతులెత్తేస్తోంది.

సొంత కుంపట్లతోనే..!

వరిసాగు, ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని నిందిస్తూ రాష్ట్రం.. రాష్ట్రానిదే తప్పు అంటూ కేంద్రం విమర్శ, ప్రతివిమర్శలకు దిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని అంశాలు పక్కకు వెళ్లి కేవలం వరి అంశంలోనే రాజకీయం సాగుతోంది. దీంతో ఇష్యూలన్నీ డైవర్ట్​అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్​పార్టీ నిరసనలకు దిగితే రైతుల మద్దతు వస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్​తరుఫున ఆందోళన కార్యక్రమాలు చేస్తారని ఊహించారు. కానీ హస్తం పార్టీ మాత్రం సొంత పార్టీలో విమర్శల్లోనే బిజీ అయింది. హుజురాబాద్​ ఫలితాలపై సీనియర్ల విమర్శలు, దాన్ని సమర్ధించుకోవడంలో టీపీసీసీ.. ఇలా సొంత కుంపట్లోనే ఉండిపోయాయి.

మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటుగా టీపీసీసీకి చెందిన ఇద్దరు, ముగ్గురు నేతలు మాత్రమే దీనిపై మీడియా సమావేశాలు, ప్రకటనల్లోనే స్పందించారు. అంతేకానీ ఈ నిరసనలను తమ చేతికి తీసుకునే ప్రయత్నాలు ఎక్కడా చేయడం లేదు.

సందిగ్థమేనా..

వరి సాగు చేస్తే ఉరే అంటూ సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనడం లేదంటూ చెప్పుకొచ్చారు. అటు కేంద్రం మాత్రం తాము పరిమితులకు లోబడి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రకటించింది. అయితే పంజాబ్‌లో కొంటున్నట్టుగా రాష్ట్రంలో మొత్తం కొనాలంటూ టీఆర్ఎస్ పార్టీ శుక్రవారం నిరసనలు చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టానం నుంచి దీనిపై ఎలాంటి నిర్ణయాలు కూడా రావడం లేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో నేతలు ఖండించేందుకు సైతం వెనకాడుతున్నారు. ప్రస్తుతం వరిపై ఎలాంటి అంశంతో ముందుకు పోవాలనే దానిపై కాంగ్రెస్​ తేల్చుకోలేకపోతోంది. అయితే ఢిల్లీ అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని, ఈ సమయంలో రాష్ట్రంలో ఎలాంటి పోరాటం చేస్తామంటూ కాంగ్రెస్​నేతలు అంటున్నారు.

Advertisement

Next Story