- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్నేళ్లు వర్గ విభేదాలు.. ఇప్పుడు ఐక్యతా రాగం
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఇన్నేళ్లూ నేతల ఆధిపత్య ధోరణి, వర్గ విభేదాలతో సతమతమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఐక్యతా రాగం వినిపిస్తోంది. అంతేకాదు వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం అవుతోంది. ఖమ్మం వేదికగా సమరశంఖం పూరించేందుకు సమాయత్తం అవుతోంది. త్వరలో జరుగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఖమ్మం పీఠాన్ని తన ఖాతాలో వేసుకుని ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సత్తా చాటాలని ఆశిస్తోంది. ఈ తలంపుతోనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతలందరినీ ఏకం చేసేపనిలో పడ్డారు. దీనిలో భాగంగానే మొన్న జరిగిన రాష్ట్రస్థాయి డీసీసీ సభ్యుల సమావేశం ఖమ్మం వేదికగా ఏర్పాటు చేసి ఇన్నాళ్లూ ఆధిపత్య ధోరణి ప్రదర్శించిన నేతలను ఏకం చేసి ఒకే వేదికపై పాల్గొనేలా చేశారు భట్టి విక్రమార్క.
దూకుడు పెంచిన కాంగ్రెస్..
ఇప్పటి వరకూ నేతలందరూ ఎవరిదారిన వారు ఉండడంతో ఖమ్మంలో కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. దీంతో హస్తం కార్యకర్తలు కూడా చేసేది లేక పనికొచ్చే పార్టీల్లోకి వలస వెళ్లిపోయారు. దీంతో ఇప్పటి వరకు ఓ వెలుగువెలుగిన తాము ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడడంతో కాంగ్రెస్ నేతలు అలర్ట్ అయ్యారు. అందుకే ఎన్నికల వేల అందరూ ఏకమై పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవల ఖమ్మంలో జరిగిన సమావేశంలో అగ్రనేతలందరూ హాజరయ్యారు. రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూరు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేణుకా చౌదరీ, పొన్నం ప్రభాకర్, సంభాని చంద్రశేఖర్.. ఇలా అగ్రనేతలంరినీ ఏకం చేయడంలో భట్టి కృషి చేస్తున్నారనే టాక్ ఉంది. త్వరలో జరుగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో దూకుడుగా వ్యవహరించాలని కూడా నిర్ణయించారు.
భట్టికి పరీక్షే..
ఒకప్పుడు ఖమ్మం కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది.. 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆరు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని అధికారపార్టీకి సవాల్ విసిరింది కాంగ్రెస్ పార్టీ. మధిర, పాలేరు, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక, భద్రాచలం స్థానాల్లో హస్తం అభ్యర్థులు గెలిచారు. అయితే కొత్తగూడెం, పినపాక, పాలేరు, ఇల్లెందు ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, కందాల ఉపేందర్ రెడ్డి, హరిప్రియానాయక్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎల్పీ నేతగా ఉన్న భట్టి జిల్లాలో ఇంత మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ఆయన ప్రతిష్టకు ఒక విధంగా భంగం కలిగిందనే చెప్పాలి.. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడితే తన ఉనికి కూడా ప్రశ్నార్థకమవుతుందని భావించిన భట్టి ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించేందుకు అన్నీ తానై వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
కార్యకర్తల్లో జోష్..
కొంతకాలంగా జిల్లాలో స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ యాక్టివ్ కావడంతో కార్యకర్తల్లో జోష్ కనపడుతోంది. ఇటీవల ఖమ్మంలో జరిగిన మీటింగ్ కు నాయకులంతా కలిసి రావడం.. రానున్న ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలను చర్చించడంతో ద్వితీయస్థాయి నాయకులు కూడా ఉత్సాహంగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నారు. భట్టి సైతం కేడర్ లో ఆత్మ స్థైర్యాన్ని నింపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసి మైలేజీ పొందే ప్రయత్నం చేశారు. అంతేకాదు మంత్రి ఎంతో అహంకారంతో వ్యవహరిస్తున్నారని.. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ఇలా అధికార పార్టీ నేతలను ఎండగడుతూ వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో పీఠం దక్కకపోయినా.. మెరుగైన స్థానాలు దక్కించుకునేలా వ్యూహం రచిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
చివరి వరకూ కొనసాగేనా..?
కాంగ్రెస్ అంటేనే.. ఆ పార్టీ నేతలది ఎవరిదారి వారిదే అనే ప్రస్తావన వస్తుంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా అదే పరిస్థితి.. ఒకప్పుడు జిల్లాలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్.. నేతల ఆధిపత్య ధోరణితో అస్తవ్యస్తంగా మారింది. సంప్రదాయంగా వస్తున్న కేడర్ సైతం చెల్లా చెదురైపోయారు.. అయితే అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో భారీస్థాయిలో మార్పులు ఉండడంతో జిల్లా నేతలు సైతం అలర్ట్ అయ్యారు. ఎన్నికల వేళ తమకు కూడా ఎక్కడ ఎసరు వస్తుందోనని ఇప్పటిదాకా ఎడమొహం పెడమొహంగా ఉన్న నేతలు ఐక్యతారాగం అందుకున్నారు. అయితే ఈ పరిస్థితి ఎన్నాళ్లూ ఉండదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేవలం పరిస్థితులకు అనుగుణంగానే అందరూ ఏకతాటిపైకి వచ్చి ఉంటారని.. మళ్లీ ఎవరికి వారు అవడం ఖాయమంటున్నారు జిల్లా నాయకులు. ఈ పరిస్థితి మారి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే బలమైన అగ్రనాయకత్వం ఉండాలని వారు కోరుకుంటున్నారు.