తలసాని దురుసుతనం మానుకోవాలి

by Shyam |
తలసాని దురుసుతనం మానుకోవాలి
X

– కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జి నిరంజన్

దిశ, న్యూస్‌బ్యూరో: కాంగ్రెస్ వాస్తవ పరిస్థితులు చెబితే.. దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా, పనికిరాని మాటలతో దూషించడం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దురుసుతనానికి నిదర్శమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జి నిరంజన్ అన్నారు. అధికార అహంకారం తలకెక్కిన మాటలకు భవిష్యత్‌లో మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ విషయమై శనివారం నిరంజన్ మీడియాతో మాట్లాడారు. ఫాంహౌస్ నుంచి బయటికి రాని సీఎం కేసీఆర్‌కు ఊడిగం చేసే తలసాని.. ప్రతిక్షాలు నెల తర్వాత బయటికొచ్చి మాట్లాడుతున్నాయనడం హాస్యాస్పదమన్నారు. లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ శ్రేణులు, స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగి ఎక్కడిక్కడ ప్రజలను ఆదుకున్నాయని వెల్లడించారు. లాక్‌డౌన్ ప్రకటించి నలభై రోజులు దాటినా.. ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రకటించిన సాయాన్ని పూర్తిస్థాయిలో అందజేయలేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో ప్రకటించిన కిలో కంది పప్పును రాష్ట్రానికి రప్పించని అసమర్థులు కాంగ్రెస్‌ను దూషించి తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

‘రాష్ట్రంలో వలస కార్మికుల సంఖ్య మొదట 3.5 లక్షల మంది అని, తర్వాత మరో 3.2 లక్షల మంది ఉన్నారని చెప్పి.. తీరా వారిని స్వస్థలాలకు పంపించాలని కేంద్రం ఆదేశాలు జారీచేయడంతో 15 లక్షల మంది ఉన్నారని చెప్పడంలో కార్మికులకు సాయం చేసే అంశంలో ప్రభుత్వ అసమర్థత బట్టబయలైందని’ జి నిరంజన్ పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి గింజ కొంటామన్న సీఎం ఇచ్చిన హామీ ‘నీటి మీద రాతలు’గానే మారిందని నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

tags: Congress, Trs, Niranjan, Srinivas, Kcr, Paddy, Migrant labour

Advertisement

Next Story

Most Viewed