టీఆర్ఎస్ దొడ్లో వంద గొర్రెలు ఉన్నయ్ : సీతక్క

by Shyam |
Congress MLA Seethakka
X

దిశ, కమలాపూర్: కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ రెండూ ఒకటేనని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా ఆదివారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ గెలుపు కోసం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో ఎవరికి ఓటు వేసినా ఒకటేనని అన్నారు. ఆ రెండు గెలిస్తే.. ఎలాంటి మార్పు జరుగదని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో దేశం, రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు లేదని అన్నారు.

ఇప్పటికే దొరవారి దొడ్లో 100 గొర్రెలు ఉన్నాయని, దొర ఎలా చెబితే అలా తలలూపుతూ ఉన్నాయని, అందుకే అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతులు పెరగాలని అభిప్రాయపడ్డారు. ప్రశ్నించే గొంతులు పెరగాలంటే కాంగ్రెస్ గెలవాలని, ప్రజా సమస్యలపై పోరాడడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, ప్రశ్నించే తత్వం ఉన్న యువకుడు బల్మూరి వెంకట్‌ను అసెంబ్లీకి పంపించాలని కోరారు. ఈ ప్రచారంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, నాయకులు నాయిని రాజేందర్, దొమ్మాటి సాంబయ్య, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story