- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రియేటివిటీకి కేరాఫ్ కామెంట్ సెక్షన్
దిశ, వెబ్‌డెస్క్ : లైక్, కామెంట్, షేర్, సబ్‌స్క్రైబ్.. నేటి యువత జీవితం మొత్తం ఈ నాలుగు పదాల చుట్టే తిరుగుతోంది. ఏదైనా పోస్ట్ నచ్చితే లైక్ చేస్తాం, దాన్ని అందరికీ తెలియజేయాలనుకుంటే షేర్ చేస్తాం, దానితో పాటు మిగతా పోస్టులు కూడా నచ్చితే సబ్‌స్క్రైబ్ చేస్తాం. కానీ ఈ మూడు కాకుండా కామెంట్ చేసి అభిప్రాయాన్ని తెలపడం ఒక కళ. అవును.. ఈ మధ్య పోస్ట్‌ల కింద, వీడియోల కింద కామెంట్లు చూస్తుంటే, కామెంట్ చేయడం ఒక కళ అని అనకుండా ఉండలేం. మామూలుగా మాట్లాడుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఏ విషయం మాట్లాడినా కుదిరితే ఆటో పంచ్‌లు, కుదరకపోతే పరోక్ష పంచ్‌లు వేస్తున్నారు. కామెంట్లతో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. పోస్ట్ ఎలాంటిదైనా కానివ్వండి విభిన్నంగా ఆలోచించి కామెంట్ పెడితే పోస్ట్ కన్నా ఎక్కువ లైకులు ఆ కామెంట్‌కే వస్తున్నాయి.
ముఖ్యంగా మీమ్ పేజీలు, వార్తా ఛానళ్ల పేజీలకైతే ఇక కామెంట్స్‌లో క్రియేటివిటీ కుప్పలుతెప్పలుగా కనిపిస్తోంది. ఒకే అంశానికి సంబంధించిన విభిన్న కోణాలు కామెంట్ సెక్షన్‌లో కనిపిస్తాయి. దీని వల్ల ఆ అంశానికి సంబంధించి ఎంతో జ్ఞానం పెరుగుతుంది. ముఖ్యంగా వ్యక్తిగత అంశాలకు సంబంధించిన పోస్ట్‌లకు చేసే కామెంట్లలో అయితే ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్తారు. వాటిలో కొన్ని ఆదర్శాన్ని ఇచ్చేవిగా ఉంటే, మరికొన్ని జీవితాన్ని భిన్న కోణంలో చూపిస్తాయి. ఇక సినిమా పేజీలు, ట్రైలర్, టీజర్ వీడియోలకు వచ్చే కామెంట్లు మరో రకం. టీజర్ చూసేసి సినిమా కథను ప్రెడిక్ట్ చేస్తుంటారు. ఆ సినిమా తీసిన దర్శకునివి ఏవైనా ఫ్లాప్ సినిమాలుంటే అవి గుర్తుచేసి మరీ రెచ్చగొడతారు. మ్యూజిక్ ఎక్కడైనా విన్నట్లుగా అనిపిస్తే దాని మూలానికి సంబంధించిన లింక్ పోస్ట్ చేసి ఎడాపెడా తిట్టేస్తారు. అలాగే మొత్తం టీజర్ కాన్సెప్ట్ ఎక్కడైనా చూసినట్లుగా అనిపిస్తే ఇక దాన్ని రచ్చ రచ్చ చేస్తారు. అయితే ఇవన్నీ నేరుగా చెప్పరు. పరోక్షంగా.. తెలివిగా, పంచ్‌లతో, ఫన్నీగా చెబుతారు.
లాజికల్‌గా కరెక్ట్‌గా లేని విషయాల గురించి పెట్టినా, పోస్ట్‌లో స్పెల్లింగ్ మిస్టేక్‌లు ఉన్నా, ఫ్యాక్ట్ చెకింగ్ సరిగా లేకున్నా.. అది మార్చే వరకు పోస్ట్ పెట్టిన వాడికి చుక్కలు చూపిస్తారు. ఏదైనా ఫొటో గానీ వీడియో గానీ పెడితే దాన్ని జూమ్ చేసి మరీ చూసి, పోస్టుమార్టం చేసి ఫన్నీ కామెంట్స్ పెడతారు. ఈ కామెంట్స్‌లో కూడా క్రియేటివిటీ పొంగి పొర్లుతుంది. అడ్మిన్ మీద మాత్రమే కాకుండా తమ అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడిన వాడిని కూడా కామెంట్లలో కొందరు టార్గెట్ చేస్తారు. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా బూతులు కూడా మాట్లాడతారు. ఆ బూతులు కూడా తెలివిగా అంటారు. కొత్త కొత్త విశ్లేషణలు, ఒకర్ని ఒకరు హేళన చేయడాలు.. ఇలా ఇక్కడ చిన్నపాటి ‘కామెంటావధానమే’ జరుగుతుంది. ఇక హీరోయిన్ల ఫొటోలకు వచ్చే కామెంట్లు మరో రకం. ఎక్కువ మంది అసభ్యకరంగా కామెంట్లు పెడితే, వాళ్లకు చెక్ పెట్టడానికి హీరోయిన్ ఫ్యాన్స్ రెడీగా ఉండి, తప్పుగా కామెంట్ చేసిన వారిని వెర్రిపప్పలు చేస్తారు. ఇక్కడ ఫ్యాన్స్ అంటే ఒకటి గుర్తొచ్చింది.
కామెంట్లలో జరిగే ఫ్యాన్‌వార్‌ల గురించి తప్పకుండా మాట్లాడాలి. ఒకసారి హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ ఏదో పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ కామెంట్ సెక్షన్‌లో టామ్ క్రూజ్ నటనను పవన్ కల్యాణ్ నటనతో ఒక అభిమాని పోల్చి కామెంట్ చేశాడు. మరో అభిమాని మహేశ్ బాబు నటనతో పోల్చాడు. ఇక యుద్ధం స్టార్ట్. అటు పవన్ ఫ్యాన్స్, ఇటు మహేశ్ ఫ్యాన్స్ ఆ కామెంట్ సెక్షన్‌లో విచ్చలవిడిగా మాట్లాడుకున్నారు. ఎంతలా అంటే టామ్ క్రూజ్ పోస్ట్‌కు 20 మిలియన్ల వరకు కామెంట్స్ ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా కామెంట్ సెక్షన్‌లో మాటల యుద్ధాలు జరిగిన రోజులు కూడా ఉన్నాయి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వచ్చే కామెంట్లు ఒక రకం అయితే, ప్రత్యేకంగా యూట్యూబ్ వీడియోలకు వచ్చే కామెంట్లు ఒక వింత రకం. ‘ఫస్ట్ కామెంట్ నాదే, ఫస్ట్ లైక్ నాదే, ఈ హీరోయిన్ ఫ్యాన్స్ అందరూ ఒక లైక్ వేసుకోండి, ఈ కామెంట్ చదివిన వారికి దేవుడు మంచి జీవితాన్ని ఇస్తాడు, మీ కుటుంబం చల్లగా ఉండాలి’.. అంటూ వింత వింత కామెంట్లు చేస్తారు. పాటల వీడియోలకు కింద లిరిక్ రాసి పెడతారు. వీడియో ఏ టైమ్‌లో ఎలా ఉందో అనాలసిస్ చేస్తారు. ఇక న్యూస్ ఛానల్ వీడియోలకైతే నానా రకాల బూతులతో కామెంట్లు చేస్తారు. కొన్నిసార్లు యాంకర్ గురించి, వారి వ్యక్తిగత జీవితాల గురించి కూడా తప్పుగా మాట్లాడతారు. అయితే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లతో పోలిస్తే యూట్యూబ్ కామెంట్లలో కాస్త క్రియేటివిటీ పాళ్లు తక్కువగా ఉంటాయి. అన్నట్లు ఇంకొక విషయం, కామెంట్లలో క్రియేటివిటీ, వల్గారిటీతో పాటు అప్పుడప్పుడు ట్రెండ్‌లు కూడా సెట్ అవుతుంటాయి. ‘బినోద్’ ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా.. ఒక్క చిన్న కామెంట్ ద్వారా అదొక ట్రెండ్ మాదిరిగా మారింది. యూట్యూబ్‌లో ఒక వీడియోకు బినోద్ అనే వ్యక్తి తన పేరును కామెంట్ చేశాడు. దానికి 7 లైక్‌లు కూడా వచ్చాయి. లైక్‌లు రావడానికి ఆ పేరులో ఏముందో తెలియదు, అసలు బినోద్ ఎవరో కూడా తెలియదు, అయినప్పటికీ అందరూ బినోద్, బినోద్ అంటూ కామెంట్లు చేసి దాన్ని ఒక ట్రెండ్‌లాగ తిరగరాశారు. ప్రత్యేకంగా కామెంట్స్‌ను హైలైట్ చేయడానికే కొన్ని పేజీలు ఉన్నాయంటే కామెంట్ సెక్షన్ క్రియేటివిటీ విలువ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే కామెంట్ సెక్షన్ ఇప్పుడు క్రియేటివిటీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని అంటున్నాం.