కేటీఆర్ ఇలాక.. లీకేజీలు, వరదలతో చెరువును తలపిస్తున్న కొత్త కలెక్టరేట్

by Sridhar Babu |   ( Updated:2021-07-22 05:27:37.0  )
Siricilla-Collectorate
X

దిశ ప్రతినిధి, కరీంనగర్/ సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం జల దిగ్భందనంలో చిక్కుకుంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కాంప్లెక్స్‌ను ప్రారంభించి 18 రోజులు గడవక ముందే భవనం పై నుంచి లీకులు.. కింది నుంచి వరద నీటిలో భవన సముదాయం చిక్కుకుపోయింది. కొత్త జిల్లాల ఆవిర్భావం తరువాత నూతనంగా ఏర్పడిన సిరిసిల్ల జిల్లాకు కలెక్టరేట్ భవనం నిర్మించిన సంగతి తెలిసిందే. మూడు ఫ్లోర్లలో కట్టిన ఈ భవనంలోనే అన్ని ప్రభుత్వ శాఖల కార్యాయాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించి డిజైన్ చేయించారు. అయితే, గురువారం కురిసిన భారీ వర్షాలతో కలెక్టరేట్ ఆవరణ అంతా వరద నీటితో నిండిపోయింది.

కలెక్టరేట్‌కు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కలెక్టరేట్ ప్రధాన ద్వారం కూడా వరద నీటితో నిండిపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ భవనాన్ని ప్రారంభించేందుకు వచ్చే రెండు రోజుల ముందు కూడా ఈ ప్రాంతంలో వాన నీరు వచ్చి చేరింది. ముఖ్యమంత్రి పర్యటన రోజున హడావుడిగా నీటిని తరలించేందుకు పెద్ద సంఖ్యలో మోటార్లు పెట్టి, కాలువలు తవ్వించి నీటిని మళ్లించారు. తిరిగి మళ్లీ గురువారం నాటి వర్షంతో కలెక్టరేట్ ఆవరణ అంతా జలాశయంగా మారిపోయింది.

ముందు చూపు లేని తనమా..?

సిరిసిల్ల కలెక్టరేట్ భవన నిర్మాణానికి ఎంచుకున్న స్థలం సరైంది కాదా.? లేక భవనాన్ని నిర్మించిన తరువాత వరద నీరు రాకుండా చర్యలు తీసుకోవడంలో విఫలం అయ్యారో తెలియదు కానీ.. కలెక్టరేట్ మాత్రం పర్యాటకులను ఆహ్లాదపర్చేందుకు జలాశయాల్లో కట్టే భవంతిని తలపిస్తోంది. సాంకేతిక నిపుణులు ఇచ్చే సలహాలతోనే నిర్మించినప్పటికీ కలెక్టరేట్ ప్రాంతమంతా నీరు నిలిచిందంటే లోపం ఎక్కడుందో, ఎవరి తప్పిదం వల్ల జరిగిందో ఏలిన వారికే తెలియాలి.

భవనం పరిస్థితి అంతే..

కలెక్టరేట్ ఆవరణే కాదు, భవనం కూడా లీకేజీలతోనే దర్శనమిస్తోంది. మూడో ఫ్లోర్ ఆర్‌సీసీలో పైపులను అమర్చిన ప్రాంతంలో కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించనట్టు స్పష్టం అవుతోంది. పై భాగమంతా కూడా లీకేజీలమయంగా మారిపోయింది. వివిధ శాఖల కార్యాలయాల ముందు నీరు వచ్చి చేరుతోంది. కింద జలాలు, పై నుంచి లీకేజీలతో ఈ భవనంలో ఉద్యోగం చేయగలుగుతామా అన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది.

Read Similar News: ‘ఈదడం’ తెలియని టీచర్లు బయటకు రావొద్దు..

Advertisement

Next Story