సర్వే పేరుతో పిండేస్తున్నారు

by Shyam |
సర్వే పేరుతో పిండేస్తున్నారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సమయం దొరికినప్పుడే రాబట్టుకోవాలి.. భయాన్ని బూచీగా చూపి వసూళ్లు చేసుకోవాలి.. జనం ఏమైనా పర్లేదు, వారి బాధలు ఎన్నైనా అవసరం లేదు.. ఖజానా నిండిందా లేదా అనేదే ప్రధానంగా ప్రభుత్వం కొత్త పంథాను అనుసరిస్తున్నది.. ఎల్​ఆర్​ఎస్​ కే అపసోపాలు పడుతూ అందినకాడల్లా అప్పులు చేసి కడుదామనుకున్న జనాలకు ఇప్పుడు ధరణి సర్వే కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.. పెండింగ్​లో ఉన్న పన్నులన్నీ చెల్లించాలనే షరతుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాక్స్​ చెల్లిస్తే తప్ప పోర్టల్​లో ఆస్తుల నమోదు ఎంటర్ కాదని పేర్కొంటుండడంతో ఆలస్యమైతే మొదటికే మోసం వస్తుందనే భయంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పేరుకుపోయిన పన్నులన్నీ చెల్లించలేక పడరాని పాట్లు పడుతున్నారు.

ప్రస్తుతం సీఎం కేసీఆర్​ రాష్ట్రంలో నిజాంను మరిపించే పాలన సాగిస్తున్నారని, ఆస్తుల నమోదు సాకుగా పాత బకాయిలన్నీ వసూలు చేస్తూ ఖజానా నింపుకునే కార్యానికి శ్రీకారం చుట్టారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ చర్యలతో తమపై మరింత భారం పడుతోందని వాపోతున్నారు. కరోనా కష్టాలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జనాలు ఇప్పుడు మొత్తం పన్నులు చెల్లించాలనే సర్కార్​ నిర్ణయంతో తల్లడిల్లుతున్నారు. అసలే ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న సర్వే తర్వాత కాలానికి మొత్తం ప్రధానమని చెబుతుండడంతో భారమైనా భరించక తప్పడం లేదని వాపోతున్నారు.

సాధారణ బిల్లు రూ.2 వేలకుపైనే..

గ్రామ పంచాయతీల్లో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. పెండింగ్​ పన్నులు చెల్లిస్తేనే పంచాయతీ పోర్టల్‌లో ఆన్‌లైన్ చేస్తామంటూ కార్యదర్శులు స్పష్టం చేస్తుండగా, ఆస్తుల నమోదు ప్రక్రియలో చిన్న చిన్న లోపాలను సరిదిద్దేందుకు వేల రూపాయలు డిమాండ్ చేస్తూ జనాల నుంచి పిండుతున్నారు. ప్రతి ఇంటిపై సగటున రూ.2 వేల నుంచి రూ.8 వేల వరకు ఒకేసారి వసూలు చేస్తున్నారు. పోర్టల్‌లో లేని ఇండ్లకు ఆస్తుల నమోదు చేయకపోవడంతో కచ్చితంగా పన్నులన్నీ చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు ఇండ్ల నమోదు, వారసుల ఎంట్రీ, స్థానికంగా యజమానులు లేని ఇండ్ల నమోదులో కొన్నిచోట్ల పంచాయతీ కార్యదర్శులు వసూళ్ల పర్వానికి దిగుతున్నారు.

అంతా మౌఖికమే..

గ్రామాల్లో పన్నుల వసూళ్ల పర్వం మౌఖిక ఆదేశాలతోనే చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. వాస్తవంగా ఆస్తుల నమోదుపైనే ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలో పాత బకాయిలన్నీ వసూలు చేస్తుండటంతో పలుచోట్ల కార్యదర్శులను నిలదీస్తున్నారు. కానీ అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు చూపించడం లేదు. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు లేవని, ఆన్‌లైన్ చేయాలంటే పన్నులన్నీ వసూలు చేయాలని మౌఖికంగా ఆదేశాలిచ్చారంటున్నారు.

సర్వర్ డౌన్..

గ్రామాల్లో ఆస్తుల నమోదుకు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. చాలా చోట్ల సర్వర్ డౌన్ అయి మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీంతో ఒక్కో ఇంటికి 30 నిమిషాలు, అంతకు మించి సమయం పడుతోంది. రాష్ట్రంలో సోమవారం నాటికి ఇంటింటి సర్వే 48 శాతం నమోదైంది. ఓ వైపు సర్వర్ డౌన్ ఉండగా, మరోవైపు గ్రామస్తుల నుంచి సరైన సమాధానం రావడం లేదు. సరైన ఉత్తర్వులు, ఆదేశాలు లేకపోవడంతో సర్వే చేస్తున్నవారు సమాధానాలు చెప్పడం లేదు. దీంతో సర్వే ముందుకు సాగడం లేదు. ఈ నెల 20 వరకు ఆస్తుల నమోదు కార్యక్రమం కొనసాగించినా వివరాలు సేకరణ ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి.

Advertisement

Next Story