ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

by Shyam |
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
X

దిశ, న్యూస్‌బ్యూరో: కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతున్న విద్యుత్ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు. ఇప్పటికే పార్లమెంట్‌‌లో చర్చకు పెట్టిన ఈ చట్టం ముసాయిదాలోని అంశాల పట్ల తమకు తీవ్ర అభ్యంతరాలున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ మంగళవారం దేశ ప్రధానికి లేఖ శారు. కొత్త విద్యుత్ సవరణ చట్టంలో పొందుపరచిన అంశాల వల్ల అటు ప్రజలకు గానీ ఇటు విద్యుత్ పంపిణీ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ ఎలాంటి ప్రయోజనం లేదని లేఖలో సీఎం స్పష్టం చేశారు. విద్యుత్ చట్టం 2003కు సవరణలు చేస్తూ తీసుకురాబోయే ఈ చట్టం ప్రభావం రాష్ట్రంలోని విద్యుత్ రంగ నిర్వహణపై పడుతుందని తెలిపారు. విద్యుత్ సబ్సిడీలు నేరుగా బదిలీ చేయాలన్న అంశాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, పేద గృహ విద్యుత్ వినియోగదారులకు సబ్సిడీ విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. ఈ సబ్సిడీలను ఆటంకపరిచే ఏ నిబంధన అయినా తమకు అభ్యంతరకరమని స్పష్టం చేశారు. రాష్ట్రాల విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(ఎస్ఈఆర్‌సీ) సభ్యులను కేంద్రం నియమించిన సెలక్షన్ బోర్డు ఎంపిక చేయడం, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ రంగానికి సంబంధించిన నిర్ణయాలను పొరుగు రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్ తీసుకోవడం సరైంది కాదని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం కేంద్రం, రాష్ట్రం రెండింటి పరిధిలోకి ఒక సబ్జెక్టు వస్తుందన్న కారణంగా కేంద్రం ఇలాంటి ఏకపక్ష చట్టాలు తీసుకొచ్చి రాష్ట్రాలను నేరుగా ప్రభావితం చేయాలనుకోవడం ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రాల విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌లకు సమాంతర అధికారాలతో నేషనల్ కాంట్రాక్ట్ ఎన్‌ఫోర్సింగ్ అథారిటీ ఏర్పాటు చేయడం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతమని అభిప్రాయపడ్డారు. జాతీయ రెన్యువబుల్ ఎనర్జీ పాలసీని కేవలం రాష్ట్రాలను సంప్రదించి కాకుండా రాష్ట్రాల స్పష్టమైన అంగీకారంతో రూపొందించాలని కోరారు. సోలార్, విండ్, హైడ్రో పవర్‌ల లభ్యత విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితి ఉన్నందునా కేంద్రం కేవలం ఒక స్థూల విధానాన్ని మాత్రమే తీసుకొచ్చి రెన్యువబుల్ ఎనర్జీపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకు వదిలేయాలని సూచించారు. విద్యుత్ మెరిట్ ఆర్డర్ షెడ్యూలింగ్ అంశంలో నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎన్‌ఎల్‌డీసీ)కు మొత్తం నిర్ణయాధికారాన్ని కట్టబెడుతూ చట్టంలో సవరణ చేయడం సరికాదని, రాష్ట్రంలో విద్యుత్ షెడ్యూలింగ్‌ను స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్ఎల్డీసీ)కు వదిలేయాలని కోరారు. తెలంగాణ ఎస్ఎల్డీసీ రాష్ట్రం లోపల విద్యుత్ మెరిట్ ఆర్డర్ షెడ్యూలింగ్‌లో సమర్ధవంతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఎన్‌ఎల్‌డీ‌సీకి అపరిమిత నిర్ణయాధికారం ఇస్తే రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను బ్యాక్‌డౌన్ చేసే ప్రమాదముందని వివరించారు. అంతేగాక డిస్కంలు కొనే విద్యుత్‌కు సంబంధించి చెల్లింపుల సెక్యూరిటీ విషయంలో ఎన్‌ఎల్డీసీకి ఎలాంటి జోక్యం ఉండొద్దని, దానిని కేవలం గ్రిడ్‌ను కాపాడడం, విద్యుత్ షెడ్యూలింగ్ లాంటి సాంకేతిక అంశాలకు పరిమితం చేయాలని కోరారు. చెల్లింపులకు సెక్యూరిటీల అంశాన్ని రాష్ట్రాల విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌లకు వదిలేయాలని పేర్కొన్నారు.

Advertisement

Next Story