అన్న‌దాత‌కు అండగా సీఎం కేసీఆర్

by Shyam |
అన్న‌దాత‌కు అండగా సీఎం కేసీఆర్
X

దిశ, వరంగల్: దేశానికి అన్నం పెట్టే రైత‌న్న‌ కరోనా కష్ట కాలంలో ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ వారికి వెన్నుద‌న్నుగా నిలిచారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జ‌న‌గామ జిల్లాలోని జ‌న‌గామ‌, లింగాల ఘ‌న్‌పూర్ మండ‌లం వ‌న‌ప‌ర్తి, వ‌డిచ‌ర్ల‌, దేవ‌రుప్పుల మండ‌లం క‌డ‌వెండి, కొడ‌కండ్ల మండ‌లం న‌ర్సింగాపురం, ఏడునూతుల త‌దిత‌ర గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్ళ‌ను మంత్రి సోమవారం ప‌రిశీలించారు. అంతేకాకుండా కొన్నిచోట్ల ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వహించారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తి మండ‌లం బుర్హాన్ ప‌ల్లి, కిష్టాపురం గ్రామాల్లో తాజాగా ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ప్రారంభించారు. తొర్రూరు మండలం సన్నూరు, ఊకల్ తదితర గ్రామాల్లో రైతులు, అధికారుల‌తో మంత్రి చర్చించి, వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అన్న‌దాత‌ను ఆదుకోవ‌డ‌మే ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన ల‌క్ష్యంగా వివరింంచారు. అందుకే దేశంలో ఎక్క‌డా లేని విధంగా రూ.30వేల కోట్ల‌తో రైతులు పండించిన ప్ర‌తి గింజ‌నూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంద‌న్నారు. కావున, రైతులు ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేద‌ని త‌మ ధాన్యాన్ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఇంటి వ‌ద్దే సిద్ధం చేసుకుని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతుల‌కు ఇబ్బందులు అధికారులు అన్నిరకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్య‌క్ర‌మంలో జ‌న‌గామ జెడ్పీ చైర్మ‌న్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి, జ‌న‌గామ క‌లెక్ట‌ర్ నిఖిల‌, జ‌న‌గామ మున్సిప‌ల్ చైర్మ‌న్, ఆయా మండ‌లాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు,స‌ర్పంచులు, ఎంపీటీసీలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, రైతులు, అధికారులు పాల్గ‌ొన్నారు.

tags: corona, lockdown, former, minister errabelli dayakar, cm kcr

Advertisement

Next Story