కరోనా కేసులు పెరగకుండా చూడాలి !

by Shyam |
కరోనా కేసులు పెరగకుండా చూడాలి !
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్‌పై చర్చ జరుగతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గత కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి శాఖాపరంగా తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ విషయంలో ముందస్తు చర్యలపై దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఆదివారం వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి కరోనా సెకండ్ వేవ్ గురించి లోతుగా చర్చించి అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరించారు. సెకండ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రజలు వ్యక్తిగతంగా తగిన పరిశుభ్రతా చర్యలతో పాటు కొవిడ్ నిబంధనలను చిత్తశుద్ధితో పాటించడమే అసలైన మందు అని సీఎం కేసీఆర్ నొక్కిచెప్పారు.

కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నందున తెలంగాణ కూడా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయని, పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని, భారీ సంఖ్యలో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం పది శాతం లోపే ఉంటుందని, దీనికి తోడు రికవరీ రేటు 94.5 శాతం దాకా ఉందని సీఎం ఈ సమావేశంలో అధికారులతో వ్యాఖ్యానించారు. కరోనా బారినపడినవారు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ, మరణాల రేటు మాత్రం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed