తొందర పడొద్దు.. తక్కువకు అమ్ముకోవద్దు !

by Shyam |
తొందర పడొద్దు.. తక్కువకు అమ్ముకోవద్దు !
X

దిశ, తెలంగాణ బ్యూరో: వానాకాలం సాగైన వరి, పత్తి ఉత్పత్తులను పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. 6వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వరి ధాన్యాన్ని గింజ లేకుండా కొంటామన్నారు. వానాకాలం పంటల కొనుగోళ్లపై సీఎం మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. పంటలకు పెట్టుబడి అందించడం దగ్గర నుండి కొనుగోలు వరకు రైతులను కాపాడుకోవాలనేదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఈసారి రికార్డుస్థాయిలో 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, అందులో 52.77 లక్షల ఎకరాల్లో వరి, 60.36లక్షల ఎకరాల్లో పత్తి, 10.78 లక్షల ఎకరాల్లో కంది సాగైందన్నారు. ఐకేపీ సెంటర్లు, కో ఆపరేటివ్ సొసైటీలు, మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని, రైతులు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు.

వరి ధాన్యం 17శాతం తేమకు లోబడి తీసుకొస్తే ఏ- గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,888, బి-గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.1,868 కనీస మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. తాలు, పొల్లు లేకుండా ఎండబోసిన ధాన్యాన్ని తెచ్చి కనీస మద్దతు ధర పొందాలని, తేమ ఎక్కువ ఉన్న ధాన్యాన్ని తెచ్చి ఇబ్బంది పడవద్దని, దీనిపై ఒకటి, రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదలవుతాయని, ఈ విషయంలో వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. పత్తిని కూడా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పూర్తిగా కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, సీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఈ విషయంలో ఏమైనా సందేహాలుంటే ఎప్పటికప్పుడు కాల్ సెంటర్ ద్వారా నివృత్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, సివిల్ సప్లయి కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, పెద్దపల్లి జెడ్పీ చైర్‌పర్సన్ పుట్ట మధు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story