సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఇక ఆ పథకానికి చట్టబద్ధత ఖాయం!

by Anukaran |   ( Updated:2021-09-06 23:13:10.0  )
Assembly
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘దళితబంధు’ పథకానికి చట్టబద్ధత కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు ప్రతీ ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్న తరహాలోనే ఇకపైన ఈ పథకానికి కూడా అలాంటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఇప్పటి వరకు ఎస్సీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ పథకానికి నిధులను విడుదల చేయాలని భావించినా.. పటిష్టంగా అమలు కావాలంటే చట్టబద్ధత కల్పించడం ఉత్తమం అని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై లోతుగా చర్చించి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదింప చేయాలనుకుంటున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత ఉన్నందున ప్రతీ ఏటా ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తుంది. వాటిని సమర్ధవంతంగా, పారదర్శకంగా ఖర్చు చేయనున్నట్లు భరోసా కల్పించింది. ఏ అవసరాల కోసం నిధులను కేటాయించిందో వాటిని అందుకోసమే ఖర్చు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఒకవేళ ఏదేని పరిస్థితుల్లో ఆ నిధులను వినియోగించని పక్షంలో వాటిని ఇతర అవసరాలకు మళ్లించడానికి వీలు ఉండదు. మరుసటి సంవత్సరానికి ప్రభుత్వం చేసే కేటాయింపులకు జమ అవుతాయి. ఇప్పుడు దళితబంధు విషయంలోనూ అదే విధానాన్ని అవలంభించాలనుకుంటున్నది.

ఎస్సీ సంక్షేమ అభివృద్ధి శాఖలో ఈ మేరకు కసరత్తు మొదలైనట్లు సచివాలయ వర్గాల సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ అయినవారితో సహా రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున సాయం అందించనున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యతా క్రమంలో కడు పేదరికంలో ఉన్న కుటుంబాల నుంచి మొదలుపెట్టనున్నట్లు వివరించారు. ఆ ప్రకారం రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో 15 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం కింద సాయం అందనున్నది. ఇందుకు సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు అవసరం కావచ్చని అంచనా వేసిన సీఎం కేసీఆర్ రానున్న ఐదేళ్ల కాలంలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతీ ఏటా బడ్జెట్‌లోనే నిధులను కేటాయించనున్నట్లు వివరించారు.

ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా చట్టబద్ధత కల్పించే తీరులో అధికారులు పేపర్ వర్క్ చేస్తున్నారు. ఈ నెల చివరి వారంలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై విస్తృతంగా చర్చ జరగనున్నదని, ఆ తర్వాత క్లారిటీ వస్తుందని సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి ఈ పథకం కింద అర్హులను ఎంపిక చేయడానికి ముసాయిదా, మార్గదర్శకాలు తయారైనా రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ వర్తింపజేయనున్నందున అసెంబ్లీ సమావేశాల తర్వాత స్పష్టమైన ఉత్తర్వులు వెలువడతాయని ఆ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.

ఇంతకాలం సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.25 వేల కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నట్లు ప్రకటించి కొంత తేడాతో నిధులను విడుదల చేసింది. ఇప్పుడు అదే తరహాలో సింహ భాగం నిధులను దళితబంధు కోసం ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి.ఈ పథకం చివరి లబ్ధిదారుని వరకు చేరే విధంగా చట్టబద్ధత కల్పించడం ద్వారా ప్రభుత్వం క్రమం తప్పకుండా నిధులను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత దీనిపై ప్రత్యేకంగా సమీక్ష ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి.

Advertisement

Next Story