అప్‌డేట్ కావాలంటోన్న సీఎం కేసీఆర్.. తెలంగాణలో సరికొత్త పాలసీలు

by Anukaran |
అప్‌డేట్ కావాలంటోన్న సీఎం కేసీఆర్.. తెలంగాణలో సరికొత్త పాలసీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం సమాజంలో, ఉద్యోగ రంగాల్లో చోటుచేసుకుంటున్న అధునాతన మార్పులకు అనుగుణంగా, వినూత్న రీతిలో ఉద్యోగాల కల్పన చేపట్టాల్సిన అవసరముందని, అందుకనుగుణంగా సరికొత్త పోస్టులపై దృష్టి పెట్టాలని రాష్ట్ర మంత్రివర్గం అభిప్రాయపడింది. కాలం చెల్లిన కొన్ని పోస్టుల అవసరం లేకుండా పోతున్నదని, కాలానుగుణంగా ఉద్యోగ వ్యవస్థలో కూడా మార్పులు చోటుచేసుకోవాలని సూచించింది. ప్రజలకు మరింత చేరువగా పాలనను తీసుకెళ్ళి సేవలందించే వ్యవస్థను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే ఏర్పాట్లు చేసుకోవాలని, ఆ దిశగా చర్యలకు పూనుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను అధికారులను కేబినెట్ ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అద్యక్షతన ప్రగతి భవన్‌లో రెండో రోజు దాదాపు ఏడున్నర గంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశం పలు నిర్ణయాలను తీసుకున్నది.

కొత్త జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాల ప్రకారమే అన్ని కేటగిరీల ఉద్యోగుల విభజన జరగాలని కేబినెట్ నిర్ణయించింది. తద్వారా జిల్లాలవారీగా, జోన్లవారీగా ఖాళీలను గుర్తించాలని, వాటితో పాటు పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రెండు రాష్ట్రాల నడుమ ఉద్యోగుల విభజన పూర్తయిందని, తెలంగాణ స్థానికత కలిగి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను ఈ మధ్యనే తెచ్చుకున్నామని, ఇంకా మిగిలిపోయిన సుమారు 300 మందిని తీసుకురాబోతున్నట్లు పేర్కొన్నది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఉద్యోగులందరినీ కలుపుకుని ఇంకా మిగిలివున్న ఖాళీలను సత్వరమే గుర్తించి మంత్రి హరీశ్‌‌రావు నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక అందచేయాలని అధికారులను మంత్రి మండలి ఆదేశించింది.

కేబినెట్ సమావేశానికి హాజరైన అన్ని శాఖల కార్యదర్శులు వారివారి శాఖలలోని మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ప్రస్తుతం ఖాళీగా ఉన్న సంఖ్య తదితర వివరాలను కేబినెట్‌కు అందించారు. ప్రతీ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను కూడా కెబినెట్ విడిగా అందించారు. రాష్ట్రంలో అన్ని శాఖలు, విభాగాల్లో కలిపి సుమారు 56 వేలకు పైగా ఖాళీ పోస్టులు ఉన్నట్లు పేర్కొని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను వివరించారు. ఆయా శాఖల కింద పనిచేస్తున్న కార్పొరేషన్లలోని పోస్టుల వివరాలను కూడా వివరించారు.

ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల క్రోడీకరణ

అన్ని ప్రభుత్వ సంస్థలకు చెందిన ఆస్తులను క్రోడీకరించి జిల్లావారీగా, విభాగాలవారీగా సంకలనం చేయాలని కేబినెట్ ఆదేశించింది. ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య, ఖాళీల సంఖ్యకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, అన్ని విభాగాల నుంచి ఐదు రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న తొమ్మిదవ, పదవ షెడ్యూళ్ళలో పలు సంస్థలు రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికే విభజన కాగా, మరికొన్ని సంస్థలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కేంద్ర హోంశాఖ సైతం ఇంకా వీటిపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఈ సమయంలో కేబినెట్ సమావేశం ఇలాంటి సంస్థల ఆస్తులపైనా, అందులో పనిచేస్తున్న ఉద్యోగులపైనా చర్చించడం, వివరాలను ఐదు రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను ఆదేశించడం గమనార్హం.

ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి ఆమోదం

‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ధాన్యం దిగుబడి పెరుగుతున్న నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించాలని, ఇందుకోసం మొదటి దశలో 10 జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గరిష్ఠంగా వెయ్యి ఎకరాల విస్తీర్ణం చొప్పున 2025 మార్చికల్లా రాష్ట్రంలో మొత్తం పది వేల ఎకరాల్లో ఈ జోన్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. పెట్టుబడులు పెట్టే ఔత్సాహికులకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వమే భూమిని సేకరించి అన్ని మౌలిక వసతులను ప్రభుత్వమే వృద్దిచేసి అర్హత మేరకు కేటాయించాలని నిర్ణయించింది. సుమారు రూ. 25 వేల కోట్ల పెట్టుబడిని ఆకర్షించి, 70 వేల మందికి ప్రత్యక్షంగా, మూడు లక్షల మందికి పరోక్షం ఉపాధి కల్పించాలని నిర్ణయించింది.

విదేశాలకు ఎగుమతిచేసే యూనిట్ల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందించాలని, ఎస్సీ-ఎస్టీ-మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ‘ప్లగ్ అండ్ ప్లే’ పద్ధతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించింది. రైస్ మిల్లులు, బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు , పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం, చేపలు, కోళ్ళు, పాలు, డైరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ జోన్ల చుట్టూ 500 మీటర్ల వరకు బఫర్ జోన్‌గా గుర్తించి జనావాసాలకు, నిర్మాణాలను అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఆసక్తి కలిగిన వ్యాపారవేత్తలు దరఖాస్తు చేసుకోవడానికి జూలై 31 వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించింది.

ప్రభుత్వం తరఫున సబ్సిడీలు

= ప్రతి యూనిట్‌కు రెండు రూపాయల చొప్పున 5 సంవత్సరాల దాకా ప్రభుత్వం సబ్సిడీని అందిస్తుంది.
= పెట్టుబడికోసం తీసుకున్న టర్మ్ లోన్‌పై చెల్లించాల్సిన వడ్డీలో 75 శాతాన్ని (రెండు కోట్ల రూపాయలకు మించకుండా) రీఇంబర్స్.
= మార్కెట్ కమిటీకి చెల్లించాల్సిన ఫీజును, ఏడు సంవత్సరాల కాలం వరకు 100 శాతం రీ ఇంబర్స్‌మెంట్
= ఆహార ఉత్పత్తులను స్టోరేజీకి తరలింపు కోసం ఈ జోన్లలో ప్రత్యేకంగా భూమి కేటాయింపు
= ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 15 శాతం మూలధనాన్ని (రూ. 20 లక్షలకు మించకుండా) మంజూరు.
మూలధనం లోన్‌పై చెల్లించాల్సిన వడ్డీలో 10 శాతం రీఇంబర్స్‌మెంట్ (మొత్తంగా 85% అవుతుంది). దీంతో గరిష్ణంగా రెండు కోట్ల వడ్డీకి మించకుండా పరిమితి ఉంటుంది.
= అర్హులైనవారికి జోన్లలో కేటాయించిన భూమి కొనుగోలు ధరమీద 33% సబ్సిడీ (రూ. 20 లక్షల మించకుండా సబ్సిడీ)
= స్వయం సహాయక సంఘాలు, రైతు సంఘాలకు (ఎఫ్‌పీవో)లకు అదనపు ప్రోత్సహకాలు. మూలధనంలో కోటి రూపాయలకు మించకుండా 15% సబ్సిడీ. మూలధనం లోన్‌పై చెల్లించాల్సిన వడ్డీలో 10% రీఇంబర్స్‌మెంట్. భూమి విలువ మీద 33% వరకు సబ్సిడీ.

వ్యవసాయంపై సబ్-కమిటీ

ధాన్యం ఉత్పత్తి పెరగనున్ననేపథ్యంలో నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్ సహా నూతన పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు గంగుల కమలాకర్, హరీశ్‌రావు, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. విత్తనాలు, ఎరువుల లభ్యత, వర్షపాతం తదితర అంశాల పై కేబినెట్ చర్చించింది. గతేడాది రెండు సీజన్లకు కలిపి మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని, ప్రభుత్వమే గ్రామాల్లో కేంద్రాలను పెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేసిందని సీఎం ఈ సమావేశంలో పేర్కొన్నారు. రైస్‌మిల్లులు సామార్థ్యాన్ని పెంచుకోవాలని, కొత్త మిల్లుల స్థాపన జరగాలని, అందుకు చొరవ తీసుకోవాల్సిందిగా పరిశ్రమల శాఖను ఆదేశించారు.

రైతులకు శిక్షణ ఇవ్వడానికి కావలసిన సౌకర్యాలను వ్యవసాయ శాఖ కల్పించాలని, ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగాలని స్పష్టంచేశారు. ఉద్యానవన శాఖను క్రియాశీలకంగా మార్చి అధికారులను, నిపుణులను జోడించి రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉండకూడదని, పోస్టులను వెంటవెంటనే భర్తీ చేయాలని కేబినెట్ ఆదేశించింది.

లాజిస్టిక్స్ పాలసీకి ఆమోదం

పారిశ్రామిక, ఈ-కామర్స్, సేవా రంగాలు పెరుగుతున్నందున లాజిస్టిక్స్ రంగాన్ని కూడా ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. లాజిస్టిక్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. కరోనా సమయంలో ప్రజలకు ఈరంగం వస్తు సేవలు అందించిందని గుర్తుచేసింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా వచ్చే అదనపు వాణిజ్యానికి లాజిస్టిక్ రంగ అవసరం చాలా ఉందని పేర్కొన్నది. గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, డ్రై పోర్టులు, ట్రక్ డాక్ పార్కింగ్ తదితర లాజిస్టిక్స్ రంగాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని నిర్ణయించింది. సుమారు 1400 ఎకరాల్లో డ్రై పోర్టును పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎగుమతులను ప్రోత్సహించడానికి కస్టమ్స్ శాఖ అనుసంధానంతో సనత్‌నగర్‌లో కొత్తగా రెండు ఇంటిగ్రేటెడ్ కంటెయినర్ డిపో (ఐసీడీ)లను స్థాపించాలని పేర్కొన్నది. దీంతో ప్రత్యక్షంగా లక్ష మందికి, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని, రాష్ట్రానికి దాదాపు రూ. 10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖకు కేబినెట్ సూచించింది.

రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని, రానున్న రెండేండ్లలో ఇరవై లక్షల ఎకరాల్లో సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. సాగుచేసే రైతులకు ఎకరాకు మొదటి సంవత్సరం రూ.26,000, రెండో, మూడో సంవత్సరాలకు రూ. 5000 చొప్పున ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందచేయాలని నిర్ణయించింది. అటవీ శాఖ, అటవీ అభివృద్ధి కార్పోరేషన్‌తో పాటు పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల సహాయంతో ఆయిల్ పామ్ మొక్కల నర్సరీలను పెంచాలని సూచించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల బృందాలు కోస్టారికా, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా తదితర దేశాలలో అధ్యయనం కోసం పర్యటనలు చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed