అక్రమ ప్రాజెక్టులపై కేసీఆర్ ఫైర్.. ఏపీ పోరుకు సీఎం రెడీ

by Shyam |
cm-kcr
X

దిశ, తెలంగాణ బ్యూరో : సాగునీటిపారుదల అంశాలు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ తదనంతర పరిణామాలపై ఆ శాఖ అధికారులతో లోతుగా సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి నదీజలాల్లో తెలంగాణకు దక్కిన వాటాను సాధించుకోడానికి రాజీలేని పోరాటం చేయనున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో యాభై శాతం వాటాను ఈ ఏడాది నుంచే వాడుకోనున్నట్లు అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర ఎత్తిపోతల ప్రాజెక్టుల అవసరాలకు పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడుతున్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ముమ్మాటికీ అక్రమమైనదేనని, పోతిరెడ్డిపాడు ద్వారా నిబంధనలకు విరుద్దంగా నీటిని తరలించుకుపోవడానికి న్యాయస్థానాల ద్వారా అడ్డుకట్ట వేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

ప్రగతి భవన్‌లో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు దాదాపు ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమీక్షలో తెలంగాణ ప్రభుత్వం ఇకపైన సాగునీటి అంశాల్లో చేపట్టనున్న కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గెజిట్‌లోని ఒక్కో అంశాన్ని (ప్రొవిజన్) అధికారులతో చర్చించారు. కృష్ణా బోర్డు నిర్వహించనున్న ఫుల్ బోర్డు మీటింగులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘనలపైనా గట్టిగా వాదించాలని అధికారులకు నొక్కిచెప్పారు. ఇప్పటికే సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్‌లో, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో జరుగుతున్న విచారణల్లో తెలంగాణ వైఖరిని తెలియజేయడంతో పాటు ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అంశాలను సోదాహరణంగా ఎక్స్‌పోజ్ చేయాలని పేర్కొన్నారు.

కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఇటీవల గెజిట్ జారీ చేసి అక్టోబరు 14వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి తీసుకెళ్ళే అంశంలో తెలంగాణకు ఎదురయ్యే సవాళ్ళు, జరిగే అన్యాయం, దాన్ని చక్కదిద్దుకోవడం తదితరాలపై అధికారులతో విస్తృతంగా సమీక్షించారు. సమావేశంలో పాల్గొన్న న్యాయ నిపుణుల నుంచి కూడా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన అభిప్రాయాలను తెలుసుకున్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వాటాకు మించి నీటిని అక్రమంగా, గతంలోని ఒప్పందాలకు భిన్నంగా తరలించడాన్ని ఈ సమావేశం తప్పుపట్టి చట్టపరిధిలో దీనిని ఎదుర్కోవాలని నిర్ణయించారు.

Advertisement

Next Story

Most Viewed