IT Ministry: ఆధార్, పాన్ వివరాలు లీక్ చేసిన వెబ్‌సైట్లను బ్లాక్ చేసిన ప్రభుత్వం

by S Gopi |
IT Ministry: ఆధార్, పాన్ వివరాలు లీక్ చేసిన వెబ్‌సైట్లను బ్లాక్ చేసిన ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆధార్, పాన్ కార్డు వివరాలతో పాటు సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేస్తున్న పలు వెబ్‌సైట్‌లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటనలో స్పష్టం చేసింది. ఆధార్ డేటాను కొన్ని వెబ్‌సైట్లు బహిరంగంగా డిస్‌ప్లే చేస్తున్నట్టు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సైబర్ సెక్యూరిటీ, పర్సనల్ డేటా రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం సదరు వెబ్‌సైట్లపై చర్యలు తీసుకుంది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్‌టీ-ఇన్) చేసిన పరిశోధనల్లో ఆయా వెబ్‌సైట్లలో భద్రతా లోపాలు ఉన్నట్టు తేలింది. వెబ్‌సైట్ నిర్వహణలో ఉన్న లోపాలను పరిష్కరించుకోవడానికి, ఐటీ మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకునేందుకు మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అందించింది. అంతేకాకుండా ఐటీ చట్టం-2000 ప్రకారం సమాచార భద్రతా నియమాలను పాటించాలని ఆదేశించింది.

బాధితులకు పరిహారం..

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 కింద ఆధార్, పాన్, ఇతర వ్యక్తిగత వివరాల లీక్ వ్యవహారంలో బాధిత వ్యక్తులకు రాష్ట్రస్థాయిలో నియమించిన అధికారుల ద్వారా పరిహారం పొందవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో బాధ్యతాయుతమైన డేటా వినియోగం, సైబర్‌ సెక్యూరిటీ పద్ధతులపై ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, ప్రజలకు అవగాహన కల్పించే అవగాహన కార్యక్రమం కూడా ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed