మకావు ఓపెన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న శ్రీకాంత్, గాయత్రి జోడీ

by Harish |
మకావు ఓపెన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్న శ్రీకాంత్, గాయత్రి జోడీ
X

దిశ, స్పోర్ట్స్ : చైనా వేదికగా జరుగుతున్న మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ జోరు ప్రదర్శిస్తున్నాడు. టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో శ్రీకాంత్ 21-13, 21-18 తేడాతో సహచరుడు ఆయుశ్ శెట్టిని ఓడించాడు. రెండు గేమ్‌ల్లోనూ మొదట శ్రీకాంత్‌కు సరైన ఆరంభం దక్కకపోయినా ఆ తర్వాత ఆధిపత్యం ప్రదర్శించాడు. రెండో గేమ్‌లో ఆయుశ్ గట్టిగా పోరాడటంతో శ్రీకాంత్‌ శ్రమించాల్సి వచ్చింది. ఒక దశలో 10-15తో వెనుకబడిన అతను ఆ తర్వాత పుంజుకుని మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. అలాగే, మహిళల డబుల్స్‌లో గాయత్రి-ట్రీసా జాలీ జోడీ కూడా ముందడుగు వేసింది. రెండో రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన లిన్ చిన్ చున్-సీ.హెచ్ టెంగ్ జోడీని 22-20, 21-11 తేడాతో మట్టికరిపించి క్వార్టర్స్‌కు చేరుకుంది. మరోవైపు, ఉమెన్స్ సింగిల్స్‌లో తస్నిమ్ మిర్ 17-21, 21-13, 10-21 తేడాతో జపాన్ క్రీడాకారిణి చేతిలో టోమోకా మియాజాకి చేతిలో పోరాడి ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమిత్ రెడ్డి-సిక్కిరెడ్డి ఆట కూడా ముగిసింది. రెండో రౌండ్‌లో వాంగ్-లిమ్ చీవ్ సియెన్(మలేసియా) జోడీ చేతిలో 21-17, 21-14 తేడాతో పరాజయం పాలైంది.

Advertisement

Next Story