IND VS BAN : నేటి నుంచి రెండో టెస్టు.. సిరీస్ క్లీన్‌స్వీప్‌పై రోహిత్ సేన కన్ను

by Harish |
IND VS BAN : నేటి నుంచి రెండో టెస్టు.. సిరీస్ క్లీన్‌స్వీప్‌పై రోహిత్ సేన కన్ను
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై టీమ్ ఇండియా కన్నేసింది. ఇప్పటికే తొలి టెస్టు నెగ్గిన రోహిత్ సేన.. రెండో టెస్టులోనూ గెలవాలని ఉవ్విళ్లూరుతున్నది. నేటి నుంచే రెండో టెస్టు ప్రారంభం. ఈ మ్యాచ్‌కు కాన్పూర్ వేదిక. మూడేళ్ల తర్వాత ఓ టెస్టు మ్యాచ్‌కు కాన్పూర్ ఆతిథ్యమివ్వబోతున్నది. సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉన్నది. చెన్నయ్‌లో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. నాలుగు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించగా 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అదే జోరును రెండో టెస్టులోనూ కొనసాగించాలని అనుకుంటున్నది. అలాగే, బంగ్లాపై తన ఆధిపత్యాన్ని చాటాలను చూస్తుంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 8 టెస్టు సిరీస్‌లు జరగగా.. ఏడింట భారతే విజయం సాధించింది. ఓ సిరీస్ డ్రాగా ముగిసింది. రెండో టెస్టు డ్రా అయినా సిరీస్‌ 1-0తో టీమిండియా సొంతమవుతుంది. ఓడితే మాత్రం సిరీస్ 1-1తో డ్రాగా ముగియనుంది. తొలి టెస్టు ఓటమి బాధలో ఉన్న బంగ్లాదేశ్ కాన్పూర్‌లో సత్తాచాటాలనుకుంటున్నది. చెన్నయ్‌లో తేలిపోయినప్పటికీ ఆ జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. కాబట్టి, టీమ్ ఇండియా మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శననే నమ్ముకోవాల్సిన అవసరం ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

ఎవరిపైనో వేటు.. మూడో స్పిన్నర్ ఎవరు?

చెన్నయ్ టెస్టులో ఎర్ర మట్టి పిచ్‌కు అనుకూలంగా టీమిండియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లలో బరిలోకి దిగింది. ఆ నిర్ణయం రోహిత్ సేనకు బాగా కలిసొచ్చింది. అయితే, కాన్పూర్‌‌లోని నల్లమట్టి పిచ్‌పై స్పిన్నర్లు ప్రభావం చూపనున్నారు. కాబట్టి, ముగ్గురు స్పిన్నర్లకు చోటు కల్పించడం ఖాయమే. ఒక్క పేసర్‌ను పక్కనపెట్టి ఆ స్థానంలో మరో స్పిన్నర్‌ను తీసుకోనున్నారు. అశ్విన్, జడేజాలకు చోటు ఖాయమే. తొలి టెస్టులో బంతి, బ్యాటుతో సత్తాచాటిన వీరిద్దరిని తప్పించే అవకాశమే లేదు. మరో స్థానం కోసం అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ పోటీపడుతున్నారు. ఇటీవల ఫామ్ పరంగా కుల్దీప్ వైపే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది. కాన్పూర్ కుల్దీప్‌కు హోంగ్రాండ్. ఈ అంశం కూడా అతని ఎంపికకు ప్రాధాన్యత ఇవ్వొచ్చు. మరోవైపు, అక్షర్ పటేల్‌ బ్యాటింగ్ సామర్థ్యం కారణంగా అతను పోటీలో ఉన్నాడు. టీమ్ మేనే‌జ్‌మెంట్ బ్యాటింగ్ లైనప్‌ను బలపేతం చేయాలనుకుంటే అక్షర్‌ను తీసుకోవచ్చు. లేదంటే కుల్దీప్‌‌కే చాన్స్ ఎక్కువ. మరోవైపు, ఇద్దరు పేసర్లకే తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో బుమ్రా, సిరాజ్ ఆకాశ్ దీప్‌లలో ఎవరిని బెంచ్‌కే పరిమితం చేస్తారన్నది తెలియాల్సి ఉంది. ఆసిస్ పర్యటన గురించి ఆలోచించి పని భారం తగ్గించాలనుకుంటే బుమ్రాకు విశ్రాంతి ఇవ్వొచ్చు. లేదంటే అతనికి చోటు పక్కానే. ఇక, సిరాజ్, ఆకాశ్ దీప్‌లలో ఒకరిపై వేటు తప్పదు. తొలి టెస్టులో ఇద్దరూ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఎకానమీ పరంగా కూడా ఇద్దరు సమానంగానే బౌలింగ్ చేశారు. మరి, ఈ ఇద్దరిలో ఎవరిని పక్కనపెడతారో చూడాలి.

వర్షం ముప్పు

రెండో టెస్టుకు వర్షం ముప్పు పొంచి ఉన్నది. తొలి మూడు రోజులు వరుణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. మొదటి రోజు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ నివేదికలు అంచనా వేశాయి. తొలి సెషన్ తర్వాత 50 శాతం, అనంతరం 80 శాతం వర్షం కురవొచ్చని అంచనా వేశాయి. మొత్తంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తొలి రోజు మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు, స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల సమస్య కూడా ఉంది. ఫ్లడ్‌లైట్లు సరిగా వెలగడం లేదు. ఒకవేళ మ్యాచ్ జరిగినా ఫ్లడ్‌లైట్లు కారణంగా ఆటను త్వరగానే నిలిపివేసే చాన్స్ ఉంది.

కాన్పూర్‌లో మూడేళ్ల తర్వాత ఓ టెస్టు

గ్రీన్ పార్క్ స్టేడియం దాదాపు మూడేళ్ల తర్వాత ఓ టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వబోతున్నది. 2021లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య చివరిగా టెస్టు జరిగింది. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ తర్వాత కాన్పూర్‌లో జరుగుతున్న మ్యాచ్ ఇదే. లక్నో స్టేడియం నిర్మాణంతో 2017 నుంచి ఇక్కడ పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు జరగలేదు.

Advertisement

Next Story

Most Viewed