- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ వరాల జల్లు వెనక ఆంతర్యం హుజురాబాద్ ఉప ఎన్నిక కాదా.?
దిశ పబ్లిక్ పల్స్ : రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. లెక్క ప్రకారం 2023 డిసెంబర్ వరకూ ప్రస్తుత శాసనసభ కాలం ఉన్నా హుజూరాబాద్ ఉపఎన్నిక విషయంలో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తున్నది. దళితులను ఆకట్టుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం కేవలం ఈటల రాజేందర్‌ను ఓడించడానికే అంటే నమ్మశక్యంగా లేదు. ఇటీవల దత్తత గ్రామం వాసాలమర్రిలో ఆయన చేసిన ప్రసంగం వింటే త్వరలో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయని ఎవరికైనా అనిపిస్తుంది. దళితబంధును రాష్ట్రమంతా పకడ్బందీగా అమలుచేస్తామని, దళితవాడల్లో అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తామని, ప్రతి ఎస్సీ బిడ్డా లక్షాధికారి అయ్యేవరకు తాను నిద్రపోనని ఆయన ఎన్నెన్నో వరాలు కురిపించారు.
ఎన్నికల హామీల్లో ఒకటైన రుణమాఫీ విషయంలో కూడా ఆయన ఈ మధ్యే మరో ముందడుగు వేసారు. రూ. 50వేల లోపున్న రుణాలను ఈ ఏడాది మాఫీ చేస్తామని ప్రకటించారు. కరోనా సంక్షోభ సమయంలోనూ రైతుబంధు డబ్బులను వరసగా నాలుగో యేడు కూడా రైతుల ఖాతాల్లో జమ చేయడం, రైతుబీమాను కొనసాగించడం, కొత్తగా చేనేత కార్మికులకు బీమా చేస్తాననడం, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడం, ఉద్యోగుల పదవీవిరమణ వయసు 61 ఏళ్లకు పెంచడం, ఆసరా పింఛన్ల వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గించడం, రెండవ విడత గొర్రెల పంపిణీ చేపట్టడం సహా పలు జనరంజక నిర్ణయాలను ఆయన అమలుచేస్తున్నారు.
ఇలా చేయడం వెనకాల కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఏదో ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రతిపక్షాలు ఊహించని రీతిలో అకస్మాత్తుగా మధ్యంతరానికి వెళ్లి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవడమే ఆ ప్లాన్ కావచ్చని అంటున్నారు. 2018లో అసెంబ్లీ రద్దు చేసిన నాటి పరిస్థితులను గుర్తు చేస్తున్నారు.
కేవలం హుజూరాబాద్‌లో గెలవడానికే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారనే వాదనను తిరస్కరించడానికి సహేతుకమైన కారణాలు చాలా ఉన్నాయి. ఒక్క నియోజకవర్గంలో గెలుపు కోసం అసలే కష్టాల్లో ఉన్న రాష్ట్ర ఖజానా నుంచి లక్షలాది కోట్ల రూ.లు ఖర్చయ్యే పథకాలను ప్రకటించనక్కరలేదు. అందుకు బదులుగా ఎన్నికల షెడ్యూలు ఎలాగూ రాలేదు కనుక ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం భారీగా నిధుల కేటాయింపు చేయవచ్చు. కులాలవారీగా, వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకోవడానికి స్థానికంగా అనేక తాయిలాలు ప్రకటించవచ్చు. ఈటల వర్గాన్ని ప్రలోభపెట్టి తమ క్యాంపులోకి ఫిరాయింపజేసుకోవచ్చు. చివరకు ఓట్ల కోసం నోట్లను విచ్ఛలవిడిగా పంపిణీ చేయవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో, సాగర్ ఉపఎన్నికలో లాగా తెలివైన వ్యూహంతో విజయాన్ని సొంతం చేసుకోవచ్చు.
అయినా, హుజూరాబాద్‌లో ఈటలను ఓడించడం అంత ఈజీ కాదని అందరి కంటే కేసీఆర్‌కే ఎక్కువ తెలుసు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, నియోజకవర్గ ప్రజలతో సుదీర్ఘ అనుబంధం, అంగబలం, అర్థబలం దండిగా ఉన్న రాజేందర్‌కు సానుభూతి పవనాలు కూడా తోడవుతాయని ఆయన అంచనా వేసివుంటారు. ఈటలకు దీటైన అభ్యర్థి అక్కడ తమకు దొరికే పరిస్థితి లేదనే విషయాన్ని గుర్తించివుంటారు. టీఆర్ఎస్ అక్కడ ఓడిపోతే.. గెలిస్తే.. తదనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనే విషయంలో కూడా సూక్ష్మస్థాయిలో అధ్యయనం చేసివుంటారు.
అయినప్పటికీ, ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటే, ఈటలను ఓడించడమనే టార్గెట్ పెట్టుకుని స్వయంగా తానే రంగంలోకి దిగారంటే హుజూరాబాద్‌కు మించిన లక్ష్యం ఏదో ఆయన మదిలో ఉండేవుంటుంది. ఏప్రిల్ 30న ఈటల వ్యవహారం మొదలైనప్పటి నుంచీ కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును మనం ఇందుకు ఆధారంగా చూపవచ్చు. ప్రగతిభవన్-ఫాంహౌజ్‌లకే పరిమితమైన సీఎం తరచూ జిల్లాల పర్యటన చేయడం, దత్తత గ్రామాలకు వెళ్లడం, ప్రజాకర్షణ లక్ష్యంగా ప్రసంగాలు చేయడం, ఓటుబ్యాంకును కొల్లగొట్టే స్థాయిలో సంక్షేమ పథకాలను ప్రకటించడం.. ఇవన్నీ ఆయన ఉద్దేశాన్ని నర్మగర్భంగా చెప్తున్నాయి.
చూస్తుంటే, దళితబంధు-రైతుబంధు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ట్రంప్ కార్డుగా కనిపిస్తున్నది. 2018లో రైతుబంధును వాడుకున్న గులాబీ అధినేత ఈసారి దళితబంధును కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ రెండింటిని కలిపి పరశురామాస్త్రంగా ప్రయోగించబోతున్నారు. తెలంగాణలోని కోటి కుటుంబాల్లో 15 లక్షలు దళితులవి కాగా, 56 లక్షలు భూములున్న రైతులవి. ఈ రెండు వర్గాలు కలిస్తే మొత్తం ఓటర్లలో దాదాపు 60శాతం ఉంటారు. కనీసం 50శాతం మేర ఓట్లను పొందడంలో సఫలమైనా టీఆర్ఎస్ గెలుపు ఖాయమవుతుంది. ఇక బీసీబంధుగా పేరు పెట్టకున్నా ముదిరాజులకు, యాదవులకు, చేనేతలకు, గౌడలకు, బీడీ కార్మికులకు విడివిడిగా అమలుచేస్తున్న పథకాలు వేన్నీళ్లకు చన్నీళ్లలా ఉపయోగపడతాయి. అన్ని కులాలవారికీ అందే ఆసరా, కల్యాణలక్ష్మిలు కూడా ఆదుకోడానికి రెడీగా ఉన్నాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, కేసీఆర్ 2022లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లబోతున్నారు. ప్రథమార్ధంలో యూపీ తదితర ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికలతో పాటు ఫిబ్రవరిలోనా లేక ఏడాది చివరన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లతో పాటు నవంబర్‌లోనా.. అనేది హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితం డిసైడ్ చేస్తుంది. ఈటలను ఓడించి అక్కడ విజయకేతనం ఎగురవేసిన పక్షంలో 2022 జనవరిలోనే శాసనసభ రద్దుకు కేసీఆర్ సిఫారసు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ ఓడిపోయినా, తన దళితబంధు-రైతుబంధు ఎఫెక్ట్ ఏయే వర్గాల్లో ఎంతుందో తెలుస్తుంది కనుక లోపాలను గుర్తించి, వ్యూహం మార్చుకుని 2022 చివరివరకూ టైం తీసుకోవచ్చు. మరిన్ని వర్గాలకు పథకాలను ప్రకటించి నవంబర్‌లో ఎన్నికలకు వెళ్లవచ్చు. ఏ రకంగా చూసినా 2022లో లేదంటే 2023 ఆరంభంలో మధ్యంతర ఎన్నికలు జరగడం మాత్రం ఖాయంగా కనిపిస్తున్నది.
ఈ నిర్ణయానికి రావడానికి కేసీఆర్ వద్ద రెండు బలమైన కారణాలున్నాయి. ఒకటి తెలంగాణ ప్రజల్లో రోజురోజుకు ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుండడం. ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్వహించిన వరస సర్వేల్లో అధికార పార్టీ గ్రాఫ్ పడిపోతుండడం ఆయనకు ఆందోళన కలిగిస్తున్నది. హామీలు బారెడు.. అమలు మూరెడు.. అన్న చందంగా కేసీఆర్ పాలన ఉందనే ప్రచారం జనంలో ప్రబలుతోంది. మరోవైపు, నియోజకవర్గాల స్థాయిలో బీజేపీ బలపడుతుండడాన్ని, రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ దూకుడును చూపిస్తుండడాన్ని కూడా ఆయన గమనిస్తున్నారు. ప్రతిపక్షాలకు మరింత టైం ఇస్తే 2023 డిసెంబర్‌కల్లా మరింత పుంజుకుని గట్టి పోటీ ఇవ్వడం ఖాయమనే అంచనాకు ఆయన వచ్చినట్లు కనిపిస్తున్నది.
రెండవ కారణం కేటీఆర్‌ను సీఎం చేయడం. 2018లో రెండవదఫా పగ్గాలు చేపట్టిన సమయంలోనే కుమారుడిని గద్దెనెక్కించాలనుకున్నా, పార్టీలో అంతర్గతంగా ఉద్యమకారుల వర్గం వ్యతిరేకించడం వల్ల ఆగిపోవాల్సివచ్చింది. ఆ తర్వాత రెండు మూడు సందర్భాల్లో తిరిగి ఆ ప్రస్తావన వచ్చినా ఆచరణ రూపం దాల్చలేదు. ఈటలను బయటకు గెంటేసిన ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఉద్యమ స్వరం దాదాపు మూగవోయిన పరిస్థితే ఉంది. బీటీ బ్యాచ్ హవా నడుస్తున్నది. తెలంగాణలోని పాత టీడీపీ నేతలందరూ తిరిగి గులాబీ గూటికి చేరుతున్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి సైతం ఫిరాయింపులు జరుగుతున్నాయి. రాళ్లిసిరిన వాళ్లకే పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని కౌశిక్‌రెడ్డికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా కేసీఆర్ చెప్పకనే చెప్పారు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కొందరు ఉద్యమనేతలకు ఉద్వాసన తప్పదని, వలసపక్షులకు చాన్స్ ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేటీఆర్‌ను సీఎం చేయడమనేది నల్లేరుపై నడకేననేది స్పష్టమే.
అయితే, ప్రజావ్యతిరేకత మెండుగా ఉండి, కేవలం రెండేళ్లే మిగిలివున్న పస్తుత పరిస్థితుల్లో సీఎం పదవిలో కేటీఆర్‌ను కూర్చోబెట్టడం తెలివైన నిర్ణయం కాదని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకు బదులుగా పార్టీని, ప్రభుత్వాన్ని చక్కదిద్ది, ప్రజల్లో అనుకూల వాతావరణాన్ని ఏర్పరచి, వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లి, విజయం సాధించి రాష్ట్రాన్ని కొడుకు చేతుల్లో పెట్టడం మేలని ఆయన అనుకుంటున్నట్లు వినవస్తోంది. ఈ దిశగా త్వరలోనే అధినేత పలు నిర్ణయాలు తీసుకోనున్నారని చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజాదరణ ఉన్న కొత్తవాళ్లను, అదీ యువనేతలను ఎంపిక చేస్తారనే టాక్ వినపడుతోంది. ఏమైనా, త్వరలో జరిగే హుజూరాబాద్ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలను ఓ మలుపు తిప్పనుందనే విషయం మాత్రం స్పష్టం. దళితబంధు-రైతుబంధు అస్త్రం పనిచేసి టీఆర్ఎస్ గెలుస్తుందా? లేక ప్రజలు ఈటలకే జైకొడతారా? చూడాలి.
— డి. మార్కండేయ. (దిశ ఎడిటర్)