ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలపై జగన్ సీరియస్

by srinivas |   ( Updated:2021-06-29 21:36:33.0  )
jagan in assembly
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు. ఒక ఎమ్మెల్యే గతంలో మంత్రిగా పనిచేస్తే మరో ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం వెయ్యి కళ్లతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వీరిద్దరి రూటు సెపరేటు. ముక్కుసూటిగా మాట్లాడతారు. అవతలి వ్యక్తి ఎవరనేది అసలు పట్టించుకోరు. రాజకీయ పార్టీలపైనే కాదు అధికారులపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు. ఓ ఎమ్మెల్యే అయితే ఐఏఎస్, ఐపీఎస్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. తాజాగా జగనన్న కాలనీలోని ఇళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇళ్లు సంసారం చేసుకునేందుకు సరిపోవంటూ అధిష్టానానికి అడ్డంగా దొరికిపోయారు. ఇకపోతే మరో ఎమ్మెల్యే ఒక సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపడానికి కారణమయ్యారు. సీఎం జగన్‌పై ఈగవాలితేనే తట్టుకోలేని ఆ నేతలు జగన్ ఇమేజ్‌కు ఇబ్బంది కలిగేలా వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ ఎమ్మెల్యేలు ఎవరో తెలుసుకోవాలని ఉందా..? ఒకరు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అయితే మరో ఎమ్మెల్యే గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఈ నేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఏది మాట్లాడినా సంచలనమే. రాజకీయాలు అటు ఉంచితే ఏది మాట్లాడాలో అది మాట్లాడేస్తారు. అది సొంత పార్టీ వ్యక్తా లేక పథకమా..ప్రతిపక్షమా అన్నది ఆయనకు అనవసరం. అందుకే నెల్లూరు జిల్లాలో చాలా మంది నాయకులు ప్రసన్నకుమార్‌రెడ్డితో పెట్టుకోవాలంటే కాస్త ఆలోచిస్తారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన అధికారులను టార్గెట్ చేశారు. అప్పటి ఎస్పీ భాస్కర్ భూషణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోవూరు నియోజకవర్గంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు టీడీపీ ఏజెంట్‌వా లేక అధికారివా అంటూ నానా హంగామా చేశారు. తానేంటో నిరూపిస్తానని సవాల్ విసిరారు. ఈ వ్యవహారం కాస్త సీఎం వైఎస్ జగన్ వరకు వెళ్లింది. దాంతో ఆయన బుజ్జగింపులతో ఎమ్మెల్యే నల్లపురెడ్డి శాంతించారు. ఆ తర్వాత మళ్లీ ఏమోచ్చిందో ఇద్దరి మధ్య విబేధాలు మెుదలయ్యాయి. చివరికి ఎస్సీ భాష్కర్ భూషణ్ ట్రాన్స్‌ అవ్వాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితం నెల్లూరులో జగనన్న కాలనీలపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ల సమక్షంలో అధికారులు రివ్యూ నిర్వహించారు. ఈ రివ్యూలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తోటి ఎమ్మెల్యేలు, మంత్రులు నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ఓ ప్రతిపక్ష నాయకుడిలా రెచ్చిపోయారు. జగనన్న కాలనీలలోని ఇళ్లపై తన అసహనం వ్యక్తం చేశారు. జగనన్న ఇళ్లలో బెడ్రూమ్స్ సరిగా లేవన్నారు. బెడ్ రూమ్స్‌లో పెళ్ళయిన కొత్త జంటలకు శోభనానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాత్ రూమ్ బయట ఏర్పాటుచేసి బెడ్రూమ్ సైజు పెంచాలని సూచించారు. అర్బన్ ప్రాంతాల్లో కేవలం 6 అంకణాల్లోనే ఇళ్లు నిర్మించనున్నారని.. అలాంటి ఇళ్లలో హాల్లో శోభనం చేసుకొని బెడ్రూమ్‌లో పడుకోవాల్సి వస్తుందంటూ ఎమ్మెల్యే డైలాగులు పేల్చారు.

ఎమ్మెల్యేల వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. దీంతో పలు చానెల్స్ ప్రసన్నకుమార్‌రెడ్డిపై ప్రత్యేక కథనాలు ప్రచారం చేశాయి. దీంతో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు. తాను జగనన్న కాలనీ పథకం ఓ యజ్ఞం అంటూ ప్రశంసించానని ఆ వ్యాఖ్యలు మానేసి ప్రజల తన దగ్గర వాపోయిన మాటలను మాట్లాడితే అవే ప్రచారం చేయడం దారుణమన్నారు. తనను సీఎం జగన్‌కు దూరం చేయాలనే ఆలోచనలతో ఎల్లో మీడియా పనిగట్టుకుని ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. తాను ఎలాంటి అసంతృప్తితో లేనని చివరి బొట్టువరకు వైసీపీలోనే ఉంటానని క్లారిటీ ఇఛ్చారు. తనపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా పద్ధతి మార్చుకోవాలంటూ ఓరేంజ్‌లో విరుచుకుపడ్డారు. మరి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వ్యహార శైలిపై వైసీపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఇకపోతే వైసీపీలో సీనియర్ నాయకుడు గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో దిట్ట. పదేళ్లుగా వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆయన ఇతర పార్టీలపై పంచ్‌లు, వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడతారు. పార్టీ విధానాల గురించి అన్నితెలిసిన నాయకుడైనా.. ఇటీవల కాపు సామాజికవర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు సొంత సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియా వేదికగా దుమారం రేపాయి. నేర ప్రవృత్తి ఆర్థికంగా బలహీనవర్గాల్లో ఎక్కువగా ఉంటుందని, చైతన్యం ఉండబోదని అంబటి సెలవిచ్చారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉండి వెనుకబడిన వర్గాలపై ఇటువంటి అభిప్రాయాలు ఉండటం..మళ్లీ వాటిని సమర్దించుకోవడంతో కాపు సామాజికవర్గం మరింత అసంతృప్తికి లోనైంది. వెంటనే క్షమాపణ చెప్పాలని.. లేకపోతే సత్తెనపల్లి నియోజకవర్గంలో నిరసనలకు దిగుతామని హెచ్చరించారు కాపు నేతలు. మంత్రి పదవి రేసులో ముందున్న అంబటి ఇలాంటి కీలకసమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి పార్టీ అధినేత దగ్గర బుక్కయ్యారు. సీనియర్ నేతయిన అంబటి ముందు వెనుక చూసుకోకుండా చేసిన వ్యాఖ్యలు పార్టీని సైతం ఇబ్బందుల్లో నెట్టి ప్రత్యర్ది పార్టీలకు కొత్త అస్త్రాన్నిచ్చాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీరి వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారి వ్యాఖ్యలపై ఆరా తీశారని సమాచారం.

వాస్తవానికి ఇద్దరు నేతలు వైసీపీలో చాలా సీనియర్స్. సీఎం జగన్‌పై ఎవరైనా విమర్శలు చేస్తూ ఒంటికాలిపై విరుచుకుపడతారు. అవతలి వారిపై మాటల దాడితో విరుచుకుపడతారు. ఇక అంబటి విషయం గురించి అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తులు వరుస వివాదాలకు కారణమవుతుండటం వైసీపీలో చర్చకు దారి తీసింది. రాబోయే ఐదు నెలల్లో రాష్ట్రమంత్రివర్గం విస్తరణ ఉంది. ఆ విస్తరణలో అంబటి రాంబాబుకు బెర్త్ కన్ఫమ్ అనుకుంటున్న సమయంలో ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆయన ఇమేజ్‌కు డ్యామేజ్ అవ్వడంతోపాటు పార్టీ ప్రతిష్టకు కూడా కాస్త ఇబ్బందేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed