నాడు డిమాండ్.. నేడు శాంక్షన్

by srinivas |
నాడు డిమాండ్.. నేడు శాంక్షన్
X

దిశ, ఏపీ బ్యూరో: ఘటనలు ఒకే రకానికి చెందినవి. నాయకుడు ఒక్కరే.. కానీ నాడు ప్రతిపక్షం.. నేడు అధికార పక్షం. అప్పుడు డిమాండ్ చేశాడు. ఇప్పుడు అందజేశాడు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో కాదు ఏపీ సీఎం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి. గతంలో ఓఎన్జీసీ గ్యాస్‌ లీకై 22 మంది చనిపోయినప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నారు. బాధితులకు కోటి రూపాయాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి. ఇటీవల విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 16 మంది చనిపోయారు. దీంతో బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సోమవారం విశాఖ గ్యాస్ లీక్ ఘటన బాధితులతో వీడియో కాన్ఫరెన్ప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. గతంలో ఓన్జీసీ గ్యాస్ లీక్ ఘటన బాధితులకు కోటి రూపాయాలు ఇవ్వాలని డిమాండ్ చేశానని, దాన్ని దృష్టిలో ఉంచుకునే ఎల్జీ పాలిమర్స్ బాధితులకు కోటి రూపాయాల పరిహారం అందజేశానని సీఎం వ్యాఖ్యనించారు. తమ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకు ఏ ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.

ఆ సంస్థకు గత ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చిందని జగన్ వెల్లడించారు. ఎల్జీ పాలిమర్స్ కార్యకలాపాలతో పాటు ప్లాంట్ విస్తరణ కూడా చంద్రబాబు హయాంలోనే జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఒక్క క్లిక్కుతో.. గ్యాస్ లీకేజ్ బాధితులైన 20 వేల మంది బ్యాంకు ఖాతాలలో 10 వేల రూపాయల చొప్పున పరిహారాన్ని జమ చేశారు.

ఈ ఘటనపై అధ్యయనానికి వేసిన కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. ప్రమాదం జరగగానే 13 వేల టన్నుల స్టైరిన్‌ను రెండు షిప్పుల్లో తరలించామని పేర్కొన్నారు. తప్పు ఎవరి కారణంగా జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ అన్నారు. గ్యాస్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక శానిటేషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. రానున్న నెల రోజులపాటు ఆయా గ్రామాల్లో వైద్యులు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయని జగన్ తెలిపారు.

Advertisement

Next Story