ఆంధ్రా కిమ్ జగన్ మోహన్ రెడ్డి: విష్ణు కుమార్ రాజు

by srinivas |
ఆంధ్రా కిమ్ జగన్ మోహన్ రెడ్డి: విష్ణు కుమార్ రాజు
X

దిశ,విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంత,ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో జగన్‌ను పోలుస్తూ విష్ణుకుమార్ రాజు విమర్శలు చేశారు. విశాఖ నగరంలోని ఉత్తర నియోజకవర్గంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటూ బుధవారం నిరసన తెలిపిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆంధ్రా కిమ్ జగన్ మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. జగన్‌కు ప్రజల కష్టాలు తెలియడం లేదని అన్నారు.

రెండున్నరేండ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తామని జగన్ చెప్పారనీ.. కానీ రెండున్నరేండ్ల తర్వాత ఏపీ సీఎం కూడా మారిపోవచ్చని ఎద్దేవా చేశారు. ఉప ముఖ్యమంత్రిగా మహిళలకు అవకాశం ఇచ్చినట్లే..ఏపీకి మొట్టమొదటి మహిళా సీఎంను చేసి జగన్ చరిత్ర సృష్టించాలన్నారు. జగన్ సతీమణి భారతి తదుపరి సీఎం అయితే ప్రజలు సంతోషిస్తారని అభిప్రాయపడ్డారు. భారతి ముఖ్యమంత్రి అయితే ప్రజల కష్టాలు తెలుసుకొని న్యాయం చేస్తారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని, అక్రమాలు జరిగినందున ఏకగ్రీవాలను రద్దు చేయాలని విష్ణుకుమార్‌ రాజు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story