మంత్రి కేటీఆర్ క్లారిటీతో పుట్టా మధుకి లైన్ క్లియర్

by Anukaran |
మంత్రి కేటీఆర్ క్లారిటీతో పుట్టా మధుకి లైన్ క్లియర్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: మంథని టీఆర్‌ఎస్‌లో నెలకొన్న స్తబ్దతకు ఎమ్మెల్సీ క్యాంపు రాజకీయాలతో బ్రేకులు పడ్డట్టు అయిందా..? నైరాశ్యంతో కొట్టుమిట్టాడుతున్న ఆ నేత శిబిరంలో సంతోషం వ్యక్తం అవుతోందా..? అధిష్టానం ఇచ్చిన స్పష్టమైన వైఖరితో ఆ నేత కూడా నూతనోత్సాహంతో కదనరంగంలోకి దిగబోతున్నారా? అంటే అవునని అనిపిస్తున్నాయి ఇటీవల జరిగిన పరిణామాలు గమనిస్తుంటే.

అక్కడేం జరగింది…?

పెద్దపల్లి జిల్లా మంథని నియోజవకర్గంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీలో గత ఎనిమిది నెలలుగా స్తబ్దత నెలకొందనే చెప్పాలి. పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ గా, మంథని నియోజకవర్గ ఇంఛార్జీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పుట్ట మధును అధిష్టానం కావాలనే పక్కన పెడుతోందన్న ప్రచారం జరిగింది. పార్టీ పెద్దలు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, గతంలో అన్నింటా ముందు వరసలో నిలబెట్టిన వారే వివక్ష చూపుతున్నారన్న చర్చలు మొదలయ్యాయి. ఇదే అదనుగా భావించిన టీఆర్‌ఎస్‌లోని ఆశావాహులు కూడా తమవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారన్న ప్రచారం జరిగింది. ప్రగతి భవన్ లో కీలక భూమిక పోషిస్తున్న సీఎం కేసీఆర్ సమీప బంధువు ఆశీస్సులతో నియోజకవర్గ ఇంఛార్జీ బాధ్యతలు తనకే అప్పగించాలని ప్రయత్నాలు చేసిన వారూ లేకపోలేదు. సొంత పార్టీ నాయకులు కూడా తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో నిజంగానే పుట్ట మధు ప్రయారిటీ తగ్గిపోయిందని నమ్మిన వారే ఎక్కువ. ఇంతకీ అధిష్టానం పెద్దల మదిలో ఏముందో తెలియక పుట్ట మధు శిబిరం కూడా అయోమయానికి గురైంది. తమ నాయకున్ని కావాలని పక్కనపెడుతున్నారా? అన్న ఆందోళన కూడా వ్యక్తం అయింది.

ఆడియో లీక్ తో…

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి ఆడియో లీక్ తో మంథని టీఆర్‌ఎస్ నాయకులు మరింత మనోవేదనకు గురయ్యారు. సాక్షాత్తు మంత్రే పుట్ట మధు ఈటల రాజేందర్ వర్గానికి వెళుతున్నారని చేసిన కామెంట్ కలకలం సృష్టించింది. మంత్రే అలా మాట్లాడినందుకు ఖచ్చితంగా తమ నేతకు ప్రాధాన్యత తగ్గిపోతోందన్న అనుమనాలకు బలం చేకూరినట్టయింది. వచ్చే ఎన్నికల నాటికి తమ నేత భవితవ్యం ఏంటన్న చర్చలు కూడా సాగాయి. అధిష్టానం ప్రత్యామ్నాయ నాయకుని వేటలో ఉండి ఉంటుందన్న చర్చలు కూడా మొదలయ్యాయి. పుట్ట మధును పక్కన పెడితే ఆయన భవితవ్యం ఏమవుతోందోనన్న కలవరం కూడా వారిలో మొదలైంది.

క్యాంపుతో పటాపంచల్…

ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపుతో పుట్ట మధుపై జరుగుతున్న ప్రచారానికి తెరపడ్డట్టయింది. పోలింగ్ కు ఒక రోజు ముందు మంత్రి కేటీఆర్ నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంథనికి చెందిన ప్రజా ప్రతినిధులు పుట్ట మధుపై జరుగుతున్న ప్రచారంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన భవితవ్యంపై సస్పెన్స్ నెలకొందని, ఇంఛార్జీని మారుస్తారంటూ జరుగుతున్న ప్రచారంతో పాటు మంత్రి ఆడియో లీక్ వ్యవహారాన్ని కూడా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ తన ఉపన్యాసంలో మంథని నియోజకవర్గ నాయకుల్లో ఉన్న అనుమనాలకు బ్రేకులు వేశారనే చెప్పాలి. పార్టీలో పుట్ట మధు విషయంలో ఎలాంటి అసమానతలు లేవని, ఆయనపై సానుకూల దృక్ఫథమే ఉందని స్పష్టం చేశారు. ముఖ్య నాయకుల్లో ఆయనపై ఎలాంటి వ్యతిరేకత లేదంటూ కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. మంథని నియోజకవర్గ ఇంఛార్జీ పుట్ట మధే ఉంటారని, రానున్న ఎన్నికల్లో కూడా ఆయనకే టికెట్ ఇస్తామని, మంచి మెజార్టీతో గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు. దీంతో మంథని నియోజకవర్గ నేతల్లో ఒక్క సారిగా సంతోషం వ్యక్తం అయింది. పుట్ట మధుపై జరుగుతున్నవన్నీ కూడా పుకార్లేనని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో తేటతెల్లం అయిందని వారు చర్చించుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలతో పుట్ట మధు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏది ఏమైనా గత కొంత కాలంగా మంథని ఇంఛార్జి పుట్ట మధుపై జరుగుతున్న ప్రచారమంతా తప్పేనని ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపుతో బట్టబయలు కావడం గమనార్హం.

Next Story

Most Viewed