బీజేపీ నేతలు అనాలోచిత వ్యాఖ్యలు మానుకోవాలి

by Shyam |
బీజేపీ నేతలు అనాలోచిత వ్యాఖ్యలు మానుకోవాలి
X

సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి

దిశ, న్యూస్‌బ్యూరో :

రాష్ట్రంలో బీజేపీ నేతలు ‘కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందాన’ వ్యవహరిస్తున్నారని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రైతులు మార్కెట్‌కు తెచ్చిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం, రైతులెవరూ ఆందోళన చెందకూడదని కోరారు. శనివారం పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులెవరూ కాలబెట్టరన్నారు. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కు ఇలాంటి వ్యవహారాలు కొత్తేమీ కాదు.. ఆయన గతంలో కూడా ఇలాంటివి చాలానే చేశారని’ అన్నారు. తన రాజకీయ లబ్ది కోసం రైతులను బద్నాం చేసుడు మానుకోవాలని హెచ్చరించారు. రైతుల మీద ప్రేమ ఉంటే కేంద్రం నుంచి గన్నీ బ్యాగులు తెప్పించాలని సూచించారు.

ధాన్యం కొనుగోలు విషయంలో కరీంనగర్‌లో కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తినట్టు వెల్లడించారు. తేమ, తాలు వస్తున్నాయని ఇబ్బందులు పెడుతున్న రైస్ మిల్లర్లను బ్లాక్ లిస్ట్‌లో పెడతామన్నారు. కేవలం కరీంనగర్‌లో మాత్రమే ఇలాంటి సమస్యలు ఎదురైనట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నామని.. కానీ బీజేపీ నాయకులు మాత్రం ఇక్కడ ఆందోళన చేస్తున్నారన్నారు. దీనిని బట్టి చూస్తే బీజేపీ నాయకులు ఎంత అనాలోచితంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. మేము ఎంత చెప్పినా.. రైతుల బాధలు పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అవాస్తవమని, కరీంనగర్ జిల్లాకే చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను ఎప్పుడైనా కలిశారా ? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు.

Tags: BJP, Bandi Sanjay, Civil supply, Mareddy Srinivas Reddy, Gangula Kamalakar

Advertisement

Next Story