సంపాదన కాదు.. సాయం గొప్పది… అంటున్న స్టార్స్

by Shyam |
సంపాదన కాదు.. సాయం గొప్పది… అంటున్న స్టార్స్
X

కరోనా వైరస్ ప్రభావం మామూలుగా లేదు. ప్రజల జీవన వ్యవస్థను దెబ్బతీసి, ఉపాధి దొరకకుండా చేసింది. దీంతో చాలా మంది కూలీలు తిండి లేక తిప్పలు పడుతున్నారు. కడుపు నింపుకునే దారి లేక కన్నీరు దిగమింగుతూ బతికేస్తున్నారు. ఇలాంటి వారికోసం ఒక్కక్కరు ఒక్కో విధానంలో సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారు సినీ ప్రముఖులు.

ఈ మధ్యే రౌడీ హీరో విజయ్ దేవరకొండ ది దేవరకొండ ఫౌండేషన్ పేరుతో మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయగా… చాలా రెస్పాన్స్ వచ్చింది. హీరో కార్తికేయ, కొరటాల శివ, పూరీ జగన్నాధ్ వంటి సినీ ప్రముఖులతో పాటు చాలా మంది ప్రజలు విజయ్ చేస్తున్న పనిని ప్రశంసిస్తూ సపోర్ట్ చేశారు. తమకు తోచిన విరాళాన్ని ఈ ఫౌండేషన్ కు అందించి పూట గడవని ఎంతో మందికి సహాయం అందించి కడుపు నిండా అన్నం పెట్టేందుకు కారకులు అయ్యారు. ది దేవరకొండ ఫౌండేషన్ వెబ్ సైట్ లో పేరు నమోదు చేసుకున్న వారికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు కొనుగోలుకు డైరెక్ట్ షాప్ లకు మనీ ట్రాన్స్ఫర్ చేశారు విజయ్. అంతే కాదు కరోనా ప్రభావం ముగిశాక లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తాం అని భరోసా ఇచ్చారు విజయ్. తమ సంస్థ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.

ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా మానవతా మూర్తి మదర్ థెరిస్సా చెప్పిన మాటలు ఇవి. ఖచ్చితంగా ఈ మాటలు ఫాలో అవుతున్న వారిలో ముందుంటారు దర్శకుడు, నటుడు, కొరియో గ్రాఫర్ రాఘవ లారెన్స్. ఇప్పటికే దాదాపు రూ. 3 కోట్ల విరాళం అందించిన లారెన్స్… తను కమిట్ అయిన సినిమాల రెమ్యునరేషన్ మొత్తాన్ని నిరుపేదలకు తిండి గింజలు అందించేందుకు వెచ్చిస్తున్నారు. కానీ ఎంతో మంది ఆకలి కేకలు వినిపిస్తుండగా… తను చేసిన సాయం ఆత్మసంతృప్తి ఇవ్వకపోవడంతో స్నేహితుల ఆలోచనను అనుసరిస్తూ… మరింత మంది ప్రముఖులను ఈ కార్యక్రమంలో తోడు ఉండాలని కోరాడు. ఆ సినీ ప్రముఖుల సపోర్ట్ తో లారెన్స్ చారిటీ ద్వారా సహాయం చేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ ను సహాయం కోరగా వెంటనే 100 క్వింటాళ్ల రైస్ బ్యాగులను పంపించినట్లు తెలిపారు. అలాగే విజయ్, అజిత్, విజయ్ సేతుపతి, ధనుష్, కమల్ హాసన్ లాంటి ప్రముఖులు కూడా పేదల కడుపు నింపే ఈ కార్యక్రమంలో భాగం కాబోతున్నట్లు వెల్లడించారు.

మనదగ్గర ఉన్నదాంట్లో కొంచెం సమాజానికి వెచ్చించడం సంతృప్తిని ఇస్తుందంటారు. సహాయం ఇంతా అంతా అనే లెక్కలు ఉండవు… ముందు అలాంటి మనసు ఉండాలి అంటారు పెద్దలు. అలాంటి దానం చేసే గుణం సింగర్ చిన్మయి శ్రీపాద కు ఉందని నిరూపించింది. తన దగ్గర ఉన్న సంపద నుంచి సమాజానికి సహాయం చేయడమే కాదు.. తనకున్న చక్కని గొంతును దానం చేస్తూ… అవసరమున్న వారికి అండగా నిలిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాటలు పాడుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ద్వారా వచ్చే డబ్బును… డైరెక్ట్ గా నిరుపేదలకు చేరేలా చర్యలు తీసుకుంది. తద్వారా కరోనా కారణంగా కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకుంటుంది.

ప్రణిత సుభాష్… అంత రాణించిన హీరోయిన్ కాదు. అంతగా డబ్బు వెనకేసుకోలేదు. సినిమాల్లో రాణించకపోతే ఏంటి.. దయాగుణం లో మహారాణి అని నిరూపించుకుంది. దాదాపు 45 రోజులుగా ప్రణిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిండి లేని వారికి అండగా నిలుస్తోంది. విరాళం ప్రకటించా కదా.. నా పని అయిపొయింది అని ఇంట్లో కూర్చోకుండా… స్వయంగా వంటలో సహాయం చేస్తూ… భజనం ప్యాకింగ్ చేస్తూ.. అసలు సాయం అందుతుందా లేదా అని పర్యవేక్షిస్తూ… జనం చేత మన ప్రణిత శభాష్ అనిపించుకుంది. మంచి మనసున్న ప్రణిత గా ప్రశంసలు అందుకుంటోంది. తన ద్వారా కడుపు నిండిన అభాగ్యుల ఆశీర్వాదం పొందుతోంది. అంతే కాదు కరోనా బాధితులను ఆదుకునేందుకు సహాయం ప్రకటించిన తొలి హీరోయిన్ కూడా ప్రణిత నే.

Tags:Vijay Devarakonda, Lawrence Raghava, Chinmayi Sripada, Corona, Covid 19

Advertisement

Next Story