ఆ ఎస్ఐ చేసిన పని ‘చిరు’ మదిని దోచింది

by Shyam |   ( Updated:2020-05-12 02:42:33.0  )
ఆ ఎస్ఐ చేసిన పని ‘చిరు’ మదిని దోచింది
X

దిశ, వెబ్ డెస్క్ :
ఇటీవలే సోషల్ మీడియాలో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి. ఎప్పటికప్పుడు తన మనసులోని విషయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. సినిమా విశేషాలతో పాటు, సామాజిక, ప్రాపంచిక విషయాలపై కూడా చిరంజీవి తన స్పందన తెలియజేస్తున్నారు. తాజాగా మ‌తి స్థిమితంలేని రోడ్డు ప‌క్కన ప‌డి ఉన్న ఓ అభాగ్యురాలికి ఆప్యాయంగా అన్నం తినిపించిన ఒడిశా ఎస్సై శుభ‌శ్రీతో మెగాస్టార్ చిరంజీవి వీడియో కాల్ మాట్లాడారు.

‘గుడ్ మార్నింగ్ శుభ‌శ్రీ జీ.. కొన్ని రోజుల క్రితం మీ వీడియో ఒక‌టి నా దృష్టికి వ‌చ్చింది. అందులో మీరు ఒక మ‌తి స్థిమితం లేని మ‌హిళ‌కు భోజ‌నం తినిపిస్తున్నారు. అది నా మ‌న‌సుకు తాకింది. న‌న్ను చ‌లింప‌చేసింది. ఆ రోజు నుంచి నేను మీతో మాట్లాడాల‌ని చాలా ప్రయత్నిస్తున్నాను. మీరు ఆ వ్యక్తి పట్ల అంత ఆదరణగా, మానవీయంగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేయాలని అనుకున్నాను. చాలా సంతోషించాను. నేను మీలో ఒక సానుభూతి నిండిన త‌ల్లి హృద‌యం చూశాను. ఇది ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. మీకు త‌ప్పకుండా ఎంతో మంది నుండి, ఎన్నో ప్రాంతాల నుండి అభినంద‌న‌లు వ‌చ్చే ఉంటాయి. మీరు ఇలాంటి ప‌నులు ఇంకా ఎన్నో చేస్తూ ఉండాలి. మీ కర్తవ్యం గొప్పగా నిర్వర్తించాలి. మిమ్మల్ని ఆ భగవంతుడు ఆశీర్వదిస్తాడు’ అని చిరంజీవి శుభశ్రీ తో మాట్లాడారు.
‘ సర్ నమస్తే.. చాలా సంతోషం సార్. నేను ఆవిడ‌కు ప్రత్యేకించి చేసిందేమి లేదు స‌ర్‌. నేను ఆవిడ‌కు భోజ‌నం అందించిన‌ప్పుడు ఆవిడ త‌న చేతుల‌తో తీసుకునే ప‌రిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఆవిడ‌కు మాన‌సిక‌మైన సమ‌స్య మాత్రమే కాదు అంగ‌వైక‌ల్యం కూడా ఉంది. మా ముఖ్యమంత్రి గారు దీని గురించి ట్వీట్ చేశారు. అంతేకాక మా ఏడీజీపీ అరుణ్ స‌ర్ ఎప్పుడు చెబుతూనే ఉంటారు. బాధ్యతలు నిర్వర్తించడం అంటే లా అండ్ ఆర్డర్ ఒక‌టే కాదు. పౌరుల‌కు ఎలాంటి అవ‌స‌ర‌మొచ్చినా స‌హాయ‌ప‌డ‌ట‌మే మ‌న కర్తవ్యమని అది నాకొక నిజ‌మైన రివార్డుగా నేను భావించాను. నేను ఎంతో ఉద్వేగంతో ఉన్నాను. మీరు నాతో మాట్లాడాల‌ని అనుకుంటున్నారని చెప్పగానే నేను ఎంతో ఉత్తేజం పొందాను. మీరొక మెగాస్టార్ మాత్రమే కాదు. మీరొక గొప్ప సామాజిక సేవ‌కులు. మీరు చేసిన ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సెమినార్లు చూశాను. ఇక టూరిజం అభివృద్ధికి మీరు చేసిన ఎన్నో ప‌నులు నాకు తెలుసు. నేను మీకు ఒక గొప్ప అభిమానిని' అంటూ చిరంజీవి మాటలకు స్పందిస్తూ శుభ‌శ్రీ మాట్లాడారు.

Advertisement

Next Story

Most Viewed