14 రోజుల రిమాండ్‌కు చింతమనేని ప్రభాకర్

by srinivas |
14 రోజుల రిమాండ్‌కు చింతమనేని ప్రభాకర్
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. టీడీపీ నాయకులపై వరుస కేసులు నమోదు అవుతుండడంతో ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఓ వైపు ఈఎస్ఐ స్కామ్ ఆరోపణల్లో ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే. అంతేకాకుండా, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు నకిలీ పత్రాలతో వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించారన్న కేసులో 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఇది ఇలా ఉండగా.. లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా.. పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే విషయంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే శుక్రవారం ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లడాన్ని ఖండించిన చింతమనేని.. కార్యకర్తలతో కలిసి ప.గో జిల్లా ఏలూరు సమీపంలో ఉన్న కలపర్రు టోల్ గేట్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ వ్యవహరంలో పోలీసులు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని చింతమనేని, మరో 8 మందిపై కేసు నమోదు చేశారు. అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరచడంతో.. ఆయన 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.

Advertisement

Next Story

Most Viewed