ఈటల గెలుపు బాధ్యతను పెంచింది : చెరుకు సుధాకర్

by Shyam |
ఈటల గెలుపు బాధ్యతను పెంచింది : చెరుకు సుధాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఈటల రాజేందర్ గెలుపు అందరిపై బాధ్యతను పెంచిందని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. హుజూరాబాద్ ఉప‌న్నిక‌లు కేసీఆర్‌కు గుణపాఠం అన్నారు. అధికారపార్టీ హ‌డావుడి, విచ్చల‌విడి డ‌బ్బు పంపిణీ, ద‌ళిత‌బంధు ఎర‌, మ‌ద్యం, మాంసం ఏ విలువ‌లు లెక్కరాని దారుణ‌మైన రీతికి ప్రజ‌లు ఇచ్చిన తీర్పు గుణ‌పాఠం అని వెల్లడించారు.

ఈటల‌కు రుణపాఠం, తెలంగాణ‌లో ఉద్యమ‌కారుల‌కు సహచర పాఠం కావాలన్నారు. ఒక‌నాడు ఎన్నిక‌లు బ‌హిష్కరించాల‌న్న విప్లవ పార్టీల నినాదాల‌తో మార్మోగిన వీణ‌వంక‌ల డొంక‌ల్లో ‘క‌మ‌లం’ హోరెత్తి ‘కారు’ మ‌బ్బుల్ని చీల్చుతూ రాజేంద‌ర్.. కేసీఆర్ దొర‌త‌నాన్ని, ఆధిప‌త్య వ‌ర్గాల మూక దాడిని ఎదిరించి విజ‌యం సాధించారన్నారు. తెలంగాణ‌లో క‌ష్టకాల‌ముంటే స‌మ‌స్యల ప‌రిష్కారానికి ఉద‌యం పాల‌క పార్టీలో, సాయంత్రం అన్నల పార్టీలో ఉంటూ నెట్టుకొచ్చేవారన్నారు.

కేసీఆర్‌ను ఎదిరించి ఉప ఎన్నిక‌ల్లో నిల‌దొక్కుకోవాలంటే.. అంతే అధికారంతో కేంద్రంలో ఉన్న బీజేపీలో చేరితే కానీ నెగ్గుకు రాలేన‌ని వ్యూహాత్మకంగా అటువైపు ప్రయాణం చేశాడన్నారు. కాంగ్రెస్ కూడ‌బ‌లుక్కొని ఓట్లు బీజేపీకి వేశారని టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. అంద‌రు లౌక్యంగా, వ్యూహాత్మకంగానే ప‌నిచేస్తేనే ఈ విజ‌యం సాధ్యమైందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story