మండలి ఎన్నికల్లో ఏలేటితో ఆ మంత్రికి చెక్..?

by Anukaran |   ( Updated:2021-12-09 07:15:09.0  )
Indrakaran Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు కొత్త చిక్కులు సృష్టిస్తున్నారు. గతంలో వన్​ సైడ్‌లా మారిన స్థానిక సంస్థల మండలి ఎన్నికలు ఈసారి అమాత్యులకు చెమటలు పట్టిస్తున్నాయి. కరీంనగర్‌లో ఓవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కొత్త ప్లాన్‌లు వేస్తుంటే.. అటు ఆదిలాబాద్‌లోనూ స్వతంత్ర అభ్యర్థి తరుఫున మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్​ఏలేటి మహేశ్వర్​రెడ్డి వ్యూహాలు వేస్తున్నారు. దీంతో ఆదిలాబాద్ లో సరికొత్త రాజకీయ వ్యూహాలు బయటకు వస్తున్నాయి. దీంతో పరిస్థితులు కాంగ్రెస్​వైపు అనుకూలిస్తే.. స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి షాక్ ఇవ్వనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఇక్కడి నుంచి ఎమ్మెల్సీ బరిలో నిలిచిన గిరిజన ఆడబిడ్డకు అండగా మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పావులు కదుపుతున్నారు. పార్టీలకతీతంగా ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ బరిలో నిలువడం, ఇబ్బందులు, ప్రలోభాలకు గురిచేసిన అధికారపార్టీకి ఎదురునిలిచిన స్వతంత్ర్య అభ్యర్థి పుష్పరాణికి మద్దతుగా స్థానిక ఓటర్లను సమీకరిస్తున్నారు.

వ్యతిరేకత.. గిరిజన నినాదం

అయితే నిధులు లేకపోవడం, సరైన ప్రాతినిధ్యం దక్కకపోవడం, చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కొంత అసంతృప్తితో ఉన్న స్థానిక నేతల నుంచి అనుకూల సంకేతాలు వస్తున్నట్లు తెలుస్తోంది. గిరిజన బిడ్డ పుష్ప తరుపున ఏలేటి మహేశ్వర్ రెడ్డి పలువురు ఓటర్లతో మంతనాలు జరుపుతున్నారు. క్యాంపుల్లో ఉండి, అందుబాటులోకి రాని వారికి కుటుంబ సభ్యుల నుంచి సమాచారం పంపిస్తున్నారు. ఎలాగైనా ఈసారి అధికార పార్టీని దెబ్బ కొట్టాలనే వ్యూహాలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు గతంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో.. మంత్రి ఇంద్రకరణ్​రెడ్డికి కొంత గ్యాప్​వచ్చిందనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రికి దూరమైన నేతలంతా ఏలేటి సపోర్ట్‌తో స్వతంత్ర్య అభ్యర్థికి జై కొడుతున్నారు. అయితే పార్టీ పరంగా కాకుండా.. ప్రభుత్వంపై వ్యతిరేకత, గిరిజన నినాదంతో ఇక్కడ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్లాన్​చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ముందు నుంచే ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న సభ్యులతో పాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాధితులందరితోనూ మహేశ్వర్​రెడ్డితో పాటుగా పత్తిరెడ్డి రాజేశ్వర్​రెడ్డి కలిసి క్రాస్​ఓటింగ్‌కు ప్లాన్ వేస్తున్నట్లు టాక్.

Advertisement

Next Story