ఢిల్లీకి 500 ట్రైన్ కోచ్‌లు అందిస్తాం: అమిత్ షా

by Shamantha N |
ఢిల్లీకి 500 ట్రైన్ కోచ్‌లు అందిస్తాం: అమిత్ షా
X

న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా కట్టడికి మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. దేశరాజధానిలో కరోనా పేషెంట్లకు పడకల కొరతను అధిగమించేందుకు 500 ట్రైన్ కోచ్‌లను అందిస్తామని ప్రకటించారు. అలాగే, కరోనా పరీక్షలను పెంచుతామని తెలిపారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌లతో కేంద్ర మంత్రులు అమిత్ షా, డాక్టర్ హర్షవర్ధన్‌లు ఆదివారం సమావేశమైన సంగతి తెలిసిందే. ఢిల్లీలో కరోనా పేషెంట్లతో వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహించిన నేపథ్యంలో అమిత్ షా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానంతరం ఆయన ట్విట్టర్‌లో పలు వివరాలు వెల్లడించారు.

కరోనా పేషెంట్లకు బెడ్‌ల కొరత ఏర్పడుతున్నదని, దాన్ని భర్తీ చేసేందుకు 500 ట్రైన్ కోచ్‌లను అందిస్తామని, అలాగే, కరోనా పేషెంట్ కాంటాక్టులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపడుతామని వివరించారు. కరోనా పరీక్షలను పెంచబోతున్నట్టు తెలిపారు. త్వరలోనే టెస్టింగ్ సంఖ్యను రెట్టింపు చేస్తామని, ఆరు రోజుల్లో మూడు రెట్లకు పెంచుతామని పేర్కొన్నారు. ఈ సమావేశం ఫలప్రదంగా జరిగిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ భేటీలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని, కరోనాపై కేంద్రం, ఢిల్లీ కలిసి పోరాడుతుందని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed