ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తేయం.. ప్రధాని హింట్

by Shamantha N |
ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తేయం.. ప్రధాని హింట్
X

న్యూఢిల్లీ: ఈ నెల 14న ముగుస్తున్న లాక్‌డౌన్‌ను పొడిగించే యోచనలో కేంద్రం ఉన్నట్టు ప్రధాని మోడీ హింట్ ఇచ్చారు. ఒకేసారి ఈ లాక్‌డౌన్ ఎత్తివేయబోమన్నట్టు సంకేతాలిచ్చారు. అయితే, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం ఉంటుందని పేర్కొన్నట్టు తెలిసింది. బుధవారం ప్రధాని మోడీ అఖిలపక్ష సమవేశాన్ని నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో మాట్లాడారు. గత మార్చి నెల 24న ప్రధాని ప్రకటించిన మూడు వారాల లాక్‌డౌన్‌ను పొడిగించేందుకే కేంద్రం మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. లాక్‌డౌన్ పొడిగించే యోచనలో ప్రధాని సంకేతమిచ్చారని ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న బీజేడీ నేత పినాకి మిశ్రా తెలిపారు. అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బందోపాధ్యాయ్, శివసేన నేత సంజయ్ రౌత్ సహా పలుపార్టీల నాయకులు పాల్గొన్నారు.

కాలం ఇక.. కరోనాకు ముంద, కరోనాకు పూర్వం : మోడీ

ప్రతి పౌరుడి ప్రాణాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని ఈ సమావేశంలో ప్రధాని అన్నారు. ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు సామాజిక అత్యయిక స్థితిని తలపిస్తున్నదని తెలిపారు. ఇవే కఠిన నిర్ణయాలకు పురికొల్పుతున్నాయని చెప్పారు. మరికొన్నాళ్లు మనమంతా జాగరూకతగా మెలగాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. కరోనాతో సామూహిక వ్యవహారంలో మార్పు వస్తుందని, సామాజిక, వ్యక్తిగత మార్పులు వస్తాయని వివరించారు. కరోనా మహమ్మారి అంతమయ్యాక మన జీవితాలు ఇప్పటిలా ఉండవని అన్నారు. ఈ కాలాన్నే కరోనాకు ముందు, కరోనాకు పూర్వంగా విభజించేంతలా ఈ మహమ్మారి ప్రభావితం చేస్తుందని తెలిపారు.

Tags: PM modi, all party meet, floor leaders, likely to extend,
lockdown, single day

Advertisement

Next Story

Most Viewed