ఓటు వేయాలంటూ..టాప్‌లెస్‌గా సెలెబ్రిటీలు

by Shyam |
ఓటు వేయాలంటూ..టాప్‌లెస్‌గా సెలెబ్రిటీలు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే నెల 2న జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా అమెరికా వైపు చూస్తోంది. అగ్రరాజ్యంలోనూ వాడీ వేడీ చర్చలు జరుగుతున్నాయి. ట్రంప్, బిడెన్‌లు పోటాపోటీగా ఎన్నికల క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన ట్రంప్, బిడెన్ ప్రెసిడెన్షియల్ డిబేట్‌ పలు ఆసక్తికరమైన చర్చలకు దారి తీసింది. ఇంటర్నెట్‌లోనూ ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికరమైన అంశాలపై చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో సెలెబ్రిటీలు టాప్‌లెస్‌గా మారి ఓటర్లకు సూచనలు, సందేశాలిస్తున్నారు. నెట్టింట్లో వారి వీడియోలు వైరల్‌గా అవుతున్నాయి. అయితే, సెలెబ్రిటీలు ఎందుకు నగ్నంగా ఇలా వీడియో తీశారు? వాళ్లు ఏం సందేహం ఇవ్వాలనుకుంటున్నారు? తెలసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నది బాధ్యతగల వ్యక్తిగా, దేశ పౌరుడిగా కనీస ధర్మం. యూఎస్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సెలెబ్రిటీలు చైతన్యపరుస్తున్నారు. కరోనా వల్ల పోలింగ్ స్టేషన్‌కు స్వయంగా వచ్చి పౌరులు ఓటు హక్కు వినియోగించే పరిస్థితి లేదు. దాంతో ‘నేక్డ్ బ్యాలెట్స్’ లేదా ‘అబ్సెంటీ బ్యాలెట్స్’ తెరమీదకు వచ్చింది. యూఎస్‌లో 25 శాతం ప్రజలు గతంలో మెయిల్ ద్వారానే ఓటు వేసేవారు. అంటే పోలింగ్ స్టేషన్లకు వెళ్లకుండా కవర్లలో తమ ఓటును మెయిల్ చేస్తారు. ఈసారి కొవిడ్ వల్ల 80 శాతం మంది మెయిల్ ద్వారా పోలింగ్‌లో పాల్గోనున్నారు. దీంతో ఆ విధానం ఇంకాస్త సీక్రెసీ పెంచింది. ఈ విధానంలో మెయిల్ ద్వారా ఓటు చేసేవారు..రెండు ఎన్వలప్ కవర్లలో తమ ఓటును భద్రపరచాలి. అంటే బ్యాలట్ పేపర్‌ను ముందుగా ఒక సీక్రసీ కవర్లో పెట్టాలి. అందులో ఓటర్ వివరాలు, తాము ఎంపిక చేసుకున్న అభ్యర్థి పేరు మాత్రమే రాయాలి. దాన్ని పూర్తిగా సీల్ చేసి మరో ఎన్వలప్‌లో పెట్టాలి. ఆ వెంటనే దాన్ని పోస్ట్ చేయాలి. ఒక వేళ ఓటరు తమ బ్యాలెట్‌ను సీక్రసీ కవర్లో పెట్టకుండా కేవలం ఎన్వెలప్‌లో మాత్రమే పెట్టి పోస్ట్ చేస్తే దాన్ని ‘నేక్డ్ బ్యాలెట్’గా పరిగణిస్తారు. దీంతో ఆ ఓటు చెల్లదు.

‘నేక్డ్ బ్యాలెట్’ విధానంపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు హాలీవుడ్ సెలెబ్రిటీలు మార్క్ రుఫలో, క్రిస్‌రాక్, జోష్‌గాడ్, సూపర్ మోడల్ నవోమి కాంప్‌బెల్, యాక్టర్, కమెడియణ్ అమీ షుమెర్, స్టాండ్ అప్ కమెడియన్ సారా సిల్వర్‌మాన్, టాక్ షో హోస్ట్ చెల్సియా హ్యాండ్లర్‌లు వీడియోలో టాప్‌లెస్‌‌గా కనిపిస్తూ..ఓటు వృథా కాకుండా ఉండాలంటే సీక్రసీ ఎన్వలప్‌తోపాటు మరో కవర్‌లో ఓటును భద్రపరచాలని ఈ వీడియోలో తెలిపారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెలెబ్రిటీలు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొంతమంది అభినందిస్తుండగా, మరికొందరు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. నేక్డ్ బ్యాలెట్ గురించి వివరించడానికి నేక్డ్‌గా కనిపించాల్సిన అవసరం లేదని, ఇది అర్థరహితమని విమర్శిస్తున్నారు. ఈ వీడియో ఓటర్లపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో తెలియాలంటే వేచి చూడాలి.

Advertisement

Next Story