రూ. 62,361 కోట్ల రీఫండ్ చెల్లింపులు చేసిన ఐటీ శాఖ

by Harish |
రూ. 62,361 కోట్ల రీఫండ్ చెల్లింపులు చేసిన ఐటీ శాఖ
X

కొవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో దాదాపు 20.44 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు పెండింగ్‌లో ఉన్న రూ. 62,361 కోట్లను ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) రీఫండ్ చేసినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శుక్రవారం వెల్లడించింది. ఏప్రిల్ 8 నుంచి జూన్ 30 మధ్యకాలంలో ఈ చెల్లింపులు జరిగినట్టు బోర్డు పేర్కొంది. “కోవిడ్-19 పరిస్థితులలో పన్ను చెల్లింపుదారులకు సహాయం చేయడానికి, 56 రోజుల పనిదినాల్లో నిమిషానికి 76 కేసుల వేగంతో పన్ను చెల్లింపులను డిపార్ట్‌మెంట్ జారీ చేసింది” అని బోర్డు తెలిపింది. దాదాపు 19.07 లక్షల పన్ను చెల్లింపుదారులకు రూ. 23,453.57 కోట్ల ఆదాయపు పన్ను వాపసు జరిగింది. అలాగే, దాదాపు 1.36 లక్షల మందికి రూ. 38,908.37 కోట్ల కార్పొరేట్ పన్ను వాపసు జారీ చేసినట్టు సీబీడీటీ పేర్కొంది. ఈ మొత్తం కూడా డిజిటల్ చెల్లింపుల్లో జరిగాయని, పన్ను చెల్లింపుదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు బోర్డు వెల్లడించింది. పన్ను చెల్లింపుదారులు ఆదాయపన్ను శాఖ పంపే మెయిల్‌కు తక్షణ ప్రతిస్పందన ఇవ్వాలని కోరింది. రీఫండ్ చెల్లింపుల్లో ఏవైన లోపాలుంటే, అలాంటి కేసుల్లో తిరిగి చెల్లింపుల కోసం ప్రాసెస్ పూర్తి చేస్తామని తెలిపింది.

Advertisement

Next Story