ఎన్నికల తంత్రం.. ఈ మూడింటిదే ‘రాజ్యం’

by Ramesh Goud |
ఎన్నికల తంత్రం.. ఈ మూడింటిదే ‘రాజ్యం’
X

ఢిల్లీ ఎన్నికల పర్వంలో డబ్బుల కట్టలు, మద్యం, మత్తు పదార్థాలు రాజ్యమేలాయి. కనీవినీ ఎరుగని రీతిలో వీటి ప్రవాహం జరిగింది. అంతేనా, బంగారం, వెండి, ఆభరణాలు, ల్యాప్‌టాప్‌లు, చీరలు, ప్రెషర్ కుక్కర్ల పంపకాలు భారీగానే జరిగినట్టు తెలుస్తున్నది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఇవి భారీ మొత్తంలో పట్టుబడినట్టు ఈసీ వెల్లడించిన గణాంకాలే ఇందుకు నిదర్శనం. పట్టుబడిన మొత్తం పెరిగినట్టే.. పంపకాల మొత్తాలు కూడా పెరిగి ఉంటాయని విశ్లేషకులు గట్టిగా చెప్పుతున్నారు. ఆ ప్రలోభాలకు తోడు అక్రమ తుపాకులూ ఈ కాలంలో మోతమోగించాయి. భారీగా లైసెన్స్‌లేని ఆయుధాలు పట్టుబడ్డాయి.

ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన జనవరి 6వ తేదీ మొదలు ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఢిల్లీ పోలీసులు, ఎక్సైజ్ శాఖ, నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో దాదాపు రూ. 52.87 కోట్ల విలువైన మద్యం, మాదక ద్రవ్యాలు, నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ. 10.02 కోట్ల నగదు, రూ. 2.63 కోట్ల విలువైన అక్రమ మద్యం, రూ. 5.87 కోట్ల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ తెలిపింది. కాగా, సుమారు రూ. 32.18 కోట్ల విలువైన బంగారం, వెండిసహా ఇతర విలువైన ఆభరణాలు, రూ. 2.16 కోట్ల ప్రెషర్ కుక్కర్లు, చీరలు, ల్యాప్‌టాప్ లాంటి ఉపకరణాలను పట్టుకున్నట్టు వెల్లడించింది. వీటి పంపకాలు పేదలు నివసిస్తున్న గల్లీల్లోనే అధికంగా జరిగినట్టు సమాచారం.

ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఢిల్లీ ఎన్నికల ప్రచార పర్వంలో ఓటర్లను లోబరుచుకునేందుకు రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తు్న్నది. నగదు, మద్యం, మత్తు పదార్థాలు, బంగారం, వెండి, గృహోపకరణాల పంపకాలతో ఓటర్లను మభ్యపెట్టి మలుపుకునే దారిని పార్టీలు అనుసరించినట్టు వెల్లడవుతున్నది. వీటి పంపకాలతోనూ దారికి రాకుంటే.. పోలింగ్ వరకు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే కుట్ర జరిగినట్టు తెలుస్తున్నది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే భారీగా లైసెన్స్‌లేని తుపాకులు పట్టుబడ్డాయి. తుపాకుల స్మగ్లింగ్‌కు సంబంధించి 402 ఎఫ్ఐఆర్‌లు దాఖలవ్వగా.. 440 మందిని అధికారులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 5వ తేదీనాటికి 494 లైసెన్స్‌లేని ఆయుధాలను సీజ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఆయుధాలను తయారు చేస్తున్న అక్రమ కర్మాగారంపై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా, దాదాపుగా ఈ నెల రోజుల వ్యవధిలోనే ఢిల్లీలో మూడు చోట్ల తుపాకీ కాల్పుల కలకలం చోటుచేసుకోవడం గమనార్హం.

అసలు కథ ఇప్పుడే మొదలైంది..!

ప్రచార పర్వం గురువారం సాయంత్రానికి ముగిసింది. కానీ, అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు అభ్యర్థులు.. డోర్ టు డోర్ క్యాంపెయిన్‌ను మొదలుపెట్టారు. ఎన్నికల ముందున్న ఈ రెండు రోజులు అభ్యర్థులకు అత్యంత కీలకం. ఏ సమయాన ఓటరు ఎటువైపు మొగ్గుతాడోనని మద్యం, నగదు పంపకాల్లో వేగం పెంచుతారు. హామీలు, ప్రలోభాలకు లెక్కే ఉండదు. రాత్రికి రాత్రి జరిగే వ్యవహారాలు అంతగా వెలుగులోకి రావు. కాబట్టి లోబరుచుకునే యత్నాలు వేగంగా జరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఈ రెండు రోజుల్లోనే పంపకాలు ఇంకా అధికంగా ఉండే అవకాశమున్నదని భావిస్తున్నారు.

అడ్డుకట్టకు ‘ఆప్’ స్పెషల్ టీం..!

ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం.. ఎంపీలు, క్యాబినెట్ మంత్రులు ఢిల్లీ వాసులైతే మినహా ఇక్కడ ఉండరాదు, కానీ, చాలా మంది బీజేపీ ఎంపీలు ఈ నెల 4వ తేదీ నుంచి ఇక్కడే మకాం వేశారని ఆప్ ఆరోపిస్తున్నది. తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈసీకీ ఫిర్యాదు చేసింది. అలాగే, నగదు, లిక్కర్ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఆప్.. 272 ప్రత్యేక బ‌ృందాలను సిద్ధం చేసినట్టు తెలిపింది. ప్రతి మున్సిపల్ వార్డుకు ఒక బృందం చొప్పున ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు పనిచేస్తుందని వివరించింది.

Advertisement

Next Story