లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్.. ఐదుగురిపై కేసు: డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి

by Shyam |

దిశ, నల్లగొండ: లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి హరీస్, హాలీమ్ కౌంటర్లు ఏర్పాటు చేసి, విక్రయాలు సాగిస్తున్న ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్టు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ పట్టణం వన్‌టౌన్ పీఎస్ పరిధిలో రాయల్ సీ కేఫ్, స్పైసీ హోటల్, గ్రాండ్ హోటల్స్ నిర్వాహకులు, సిబ్బంది లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. దీంతో సీఐ నిగిడాల సురేష్ నేతృత్వంలో కేసులు నమోదు చేసినట్టు స్పష్టం చేశారు. హరీస్, హలీమ్ విక్రయాలు సాగిస్తున్న స్పైసీ హోటల్ నిర్వాహకుడు ఎండీ ఫరీదుద్దీన్, అందులో పనిచేసే ముస్తాక్, రాయల్ సీకేఫ్ నిర్వాహకుడు ఇమ్రాన్, వంట మాస్టర్ మహ్మద్ లతీఫ్, గ్రాండ్ హోటల్ నిర్వాహకుడు షేక్ ఆరీఫ్‌లను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశామన్నారు. నల్లగొండ సబ్ డివిజన్ పరిధిలో హరీస్, హలీమ్ విక్రయాల నిమిత్తం కౌంటర్లు ఏర్పాటుకు పోలీస్ శాఖ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. కొంతమంది వ్యక్తులు ఎలాంటి ముందస్తు సమాచారం, అనుమతి లేకుండా పట్టణంలో పలు పాన్ షాప్స్, బేకరీల వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తున్నారని, ఇవి పూర్తిగా చట్ట విరుద్ధమన్నారు. లాక్‌డౌన్ రూల్స్ ఎవరూ ఉల్లంఘించినా చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.

Tags: lockdown, rules break, shops open, 5 mem againts case file, dsp venkateshwar reddy orders

Advertisement

Next Story