- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మం యువకుల చేతిలో రూ. కోట్లు.. ఎక్కడవీ ?
దిశ ప్రతినిధి, ఖమ్మం: గంజాయి మాఫియా దందాకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. జిల్లా మీదుగా గంజాయి రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఈ దందాను అడ్డుకునేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. గంజాయిని వివిధ రూపాల్లో తయారు చేసి స్మగ్లింగ్ చేస్తున్నారు. గడచిన రెండు నెలల కాలంలో రూ.5 కోట్ల దందా సాగింది అంటే అక్రమ వ్యాపారం ఎంతలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా నుంచి జిల్లా మీదుగా వివిధ రాష్ట్రాలకు, ప్రాంతాలకు జరుగుతున్న గంజాయి అక్రమ దందాపై ‘దిశ’ ప్రత్యేక కథనం..
పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా గంజాయి రవాణాకు బ్రేక్ పడటం లేదు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా నుంచి భద్రాచలం మీదుగా గంజాయి రవాణా సాగుతూనే ఉంది. పోలీసుల తనిఖీల్లో నిత్యం లక్షల విలువ చేసే నిషేధిత ఎండు గంజాయి లభ్యమవుతునే ఉంది. గడిచిన నెలన్నర కాలంలోనే సుమారు రూ.4కోట్ల విలువ చేసే సరుకును పోలీసులు సీజ్ చేశారు. వారం రోజుల క్రితం ఒక్కరోజే రూ.63.73 లక్షల విలువైన గంజాయి పట్టుబడటం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఆ మరుసటి రోజూ కూడా రూ.32లక్షల విలువ చేసే సరుకును భద్రాచలం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రాచలం పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
ఇటు అరకు నుంచి.. అటు మల్కనగిరి నుంచి..
ఈజీ మనీకి అలవాటు పడుతున్న కొంతమంది హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్ జిల్లాల యువకులు స్మగ్లర్లుగా మారుతున్నారు. జిల్లాకు చెందిన వాళ్లు ఇప్పటి వరకు పట్టుబడలేదని పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే పొరుగున ఉన్న మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ బంగ్లా, గూడురు, మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి శివారులో ఉన్న తండాలకు చెందిన పలువురు పట్టుబడటం గమనార్హం. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు గంజాయి ముఠాలు ఖరీదైన కార్లు వాడుతుండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ జిల్లాలైన విశాఖ, శ్రీకాకుళం, విజయనగరంలో పలు ప్రాంతాల్లో గంజాయి పండిస్తుంటారు. ముఖ్యంగా అరకు ప్రాంతం నుంచి ఎక్కువగా రవాణా జరుగుతున్నట్లుగా పోలీసుల విచారణలో పలుమార్లు వెల్లడైంది. ఒక ఒడిశా రాష్ట్రంలోని మల్కనగిరి నుంచి కూడా పెద్ద ఎత్తున భద్రాచలం మీదుగా హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు గంజాయిని ముఠాలు రవాణా చేస్తున్నాయి.
తనిఖీలను విస్తృతం చేసిన పోలీసులు
ఒడిశా, చత్తీస్‌గడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి వచ్చే వాహనాలను పోలీసు, సీఆర్‌పీఎఫ్ క్యాంపు, వివిధ శాఖల అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కార్లు, ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తున్నగంజాయి పెద్ద ఎత్తున పట్టుబడుతోంది. అయితే గంజాయి తరలింపులో దొరికిన వారు తక్కువేనని తెలుస్తోంది. వాస్తవానికి గత మూడేళ్లుగా భద్రాచలం మీదుగా గంజాయి రవాణా పెరిగిందని పోలీస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒడిశా, చత్తీస్‌గఢ్, ఏపీల మీదుగా తరలివస్తున్న గంజాయిని నిరోధించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోకి గంజాయి రవాణాను అరికట్టవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆ చెక్‌పోస్టులు దాటి గంజాయి భద్రాద్రి మీదుగా వెళ్లడం వెనుక ఏపీలోని చెక్‌పోస్టుల వద్ద నిఘా వైఫల్యాన్ని స్పష్టంగా ఎత్తి చూపుతోంది.