సొంతింటికి రూ.కోటి పెడతాం.. డూప్లెక్సులే మేలు

by Anukaran |   ( Updated:2021-02-26 09:27:49.0  )
సొంతింటికి రూ.కోటి పెడతాం.. డూప్లెక్సులే మేలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదార్ల మైండ్ సెట్ మారుతోంది. కరోనా కష్ట కాలంలో దాదాపుగా అన్ని రంగాలు నష్టాల బాటనే నడిచాయి. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా నష్టపోయారు. కానీ సొంతింటి విషయంలో మాత్రం అది చూడడం లేదు. ఖర్చు ఎక్కువైనా ఫర్వాలేదు. మంచి ఇల్లు ఉండాల్సిందేనంటున్నారు. ప్రైవసీని కోరుతున్నారు. ఇరుకుగా ఉండొద్దు. గాలి, వెలుతురు బాగా రావాలి. రోడ్లు బాగుండాలి. అపార్టుమెంట్ల కంటే ఇండిపెండెంట్ ఇండ్లకే మొగ్గు చూపుతున్నారు. ఇలా కరోనా వైరస్ వ్యాప్తికి ముందు, తర్వాత గృహ వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు కనిపిస్తున్నాయి.

మైండ్ సెట్ ఎలా మారిందంటే..

స్వ్కయర్ యార్డ్స్ అనే టెక్ లెడ్ బ్రోకరేజ్, మార్ట్ గేజ్ మార్కెట్ ప్లేస్ అనే సంస్థ వినియోగదారుల మనస్తత్వం ఎలా మారుతుందన్న అంశంపై రిపోర్టు విడుదల చేసింది. ప్రధానంగా విల్లాలు కొనేందుకు ఆసక్తి చూపారు. అలాగే ఇంటి కోసం రూ.కోటికి పైగా ఖర్చు చేసేందుకు సిద్ధపడే వారి సంఖ్య కూడా పెరగడం విశేషం. కరోనా వైరస్ సమయంలో ఇరుకుగా ఉండే కాలనీవాసులు, అపార్టుమెంట్ వాసుల్లో ఆందోళన తీవ్రంగా కనిపించింది. ఏదైనా ఒక్క అపార్టుమెంటులో ఏ ఒక్కరికి కరోనా పాజిటివ్ అని రూఢీ కాగానే ఆ వైపు కూడా వెళ్లేందుకు ధైర్యం సరిపోలేదు. ఎవరైనా చనిపోతే కనీసం ఇంటికి కూడా తీసుకురాలేని దుస్థితి నెలకొంది. అందుకే ఇప్పుడు మనుషులకు దూరంగా ఉండడమే మేలన్న అభిప్రాయానికి వచ్చారు. ఆర్థికంగా దివాళా తీసినా విశాలమైన సొంతింటి కోసం అప్పు చేయడానికైనా సిద్ధమంటున్నారు. తాజా త్రైమాసికానికి, అంతకు ముందున్న వినియోగదారుల మనస్తత్వంలో ఎంతో మార్పు కనిపించిందని నివేదిక ప్రకారం స్పష్టమవుతోంది.

ఎలాంటి ఇల్లు కావాలి?

అంశం జూలై-సెప్టెంబరు 2020 అక్టోబరు-డిసెంబరు 2020
సింగిల్ బెడ్రూం ఇండ్లు 15 శాతం 25 శాతం
డబుల్ బెడ్రూం ఇండ్లు 35 శాతం 35 శాతం
త్రిబుల్ బెడ్రూం ఇండ్లు 38 శాతం 32 శాతం
4 బెడ్రూం ఇండ్లు 9 శాతం 7 శాతం
5 బెడ్రూం ఇండ్లు 3 శాతం 1 శాతం

డబుల్ బెడ్రూం వైపు మొగ్గు

గతేడాది చివరి క్వార్టర్ లో డబుల్ బెడ్రూం ఇండ్లు కోరుకునే వారి సంఖ్య పెరిగింది. అంతకు ముందు త్రైమాసికం కంటే పది శాతం అధికంగా సెర్చ్ చేశారు. సింగిల్, డబుల్ బెడ్రూం ఇండ్లను సెర్చ్ చేసిన వారే అధికం. అలాగే త్రిబుల్ బెడ్రూం ఇండ్లు కోరుకునే వారి సంఖ్య 6 శాతం పడిపోయింది. ఇక 4, 5 బెడ్రూం ఇండ్ల వారిలోనూ 2 శాతం తగ్గింది. దీన్ని బట్టి కరోనా వైరస్, సంక్షోభ ప్రభావం కనబడింది.

లో బడ్జెట్‌కే జై

బడ్జెట్ శాతం(జూలై-సెప్టెంబరు 2020) శాతం(అక్టోబరు-డిసెంబరు 2020)
0-30 లక్షలు 32 23 శాతం
30-60 లక్షలు 27 27 శాతం
60- కోటి 17 23 శాతం
రూ.కోటికి పైగా 24 27 శాతం

డబ్బులు ఎన్నయినా సరే సొంతిల్లు ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే రూ.కోటికి పైగా వెచ్చించేందుకు సిద్ధపడిన వారి సంఖ్య కొంత పెరిగింది. పైగా ఇరుకుగా ఉండే ఇంటి పట్ల విముఖత చూపిస్తున్నారు. అందుకే విశాలమైన ప్లాట్లనే కోరుకుంటున్నారు. అందుకే తక్కువ బడ్జెట్ లో వచ్చే ఇండ్లను సెర్చ్ చేసే వారి సంఖ్య తగ్గింది. అదే రూ.30-60 లక్షల వరకు వెచ్చించే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అలాగే 60-కోటి వరకు పెట్టే వారి సంఖ్య కూడా 6 శాతం పెరగడం గమనార్హం. దీన్ని బట్టి కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక పరిస్థితులపై ఎంతగా పడినా సొంతింటిపై మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు.

ఎలాంటి వాటిపై ఆసక్తి

అంశం జూలై-సెప్టెంబరు 2020 అక్టోబరు-డిసెంబరు 2020
బిల్డర్ ఫ్లోర్స్ 3 శాతం 2 శాతం
ప్లాట్లు 10 శాతం 22 శాతం
అపార్టుమెంట్లు 64 శాతం 48 శాతం
విల్లాలు 23 శాతం 28 శాతం

– అపార్టుమెంట్లపై మోజు తగ్గింది. ఇండిపెండెంట్ ఇండ్లను కోరుకుంటున్నారు. ప్రైవసీ ఉండదన్న భావన వ్యక్తమైంది. అందుకే ఒక్క త్రైమాసికంలోనే ఏకంగా 16 శాతం పడిపోవడం గమనార్హం. విల్లాల కొనేందుకు ఆసక్తి చూపే వారి సంఖ్య కూడా 5 శాతం పెరిగింది.

ఏ సిటీలో ఎంత?(సెర్చ్ చేసిన వారు)

నగరం జూలై-సెప్టెంబరు 2020 అక్టోబరు-డిసెంబరు 2020
నోయిడా 9 శాతం 5 శాతం
గుర్ గాం 16 శాతం 9 శాతం
ముంబాయి 26 శాతం 33 శాతం
పూణె 13 శాతం 12 శాతం
హైదరాబాద్ 13 శాతం 21 శాతం
బెంగుళూరు 23 శాతం 20 శాతం

– ఇండ్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతోన్న వారి సంఖ్య ముంబాయి తర్వాత హైదరాబాద్ లోనే అధికం. పైగా కరోనా తర్వాత హైదరాబాద్ లో 8 శాతం పెరిగింది. అదే ముంబాయిలో 7 శాతమే. బెంగుళూరు, పూణెల్లో కొనుగోలుదార్ల సంఖ్య తగ్గిపోయింది.

హైదరాబాద్ లో ఎక్కడెక్కడ?

ఉత్తరం 15 శాతం
సెంట్రల్ 26 శాతం
పడమర 41 శాతం
తూర్పు 9 శాతం
దక్షిణం 9 శాతం

హైదరాబాద్ కు పడమర వైపునే ఇండ్ల కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సెర్చ్ చేసిన వారి సంఖ్య చెబుతోంది. ఒక్క పడమర వైపునే చూసిన వారు 41 శాతం ఉంటే మిగతా నాలుగు వైపులా ఉన్నారు. ప్రధానంగా గచ్ఛిబౌలి, కొండాపూర్, మణికొండ, కూకట్ పల్లి, నార్సింగి ప్రాంతాల్లో ఇల్లు కోరుకునే వారి సంఖ్య అధికంగా కనిపించింది. ఈ ప్రాంతంలోనే హైరైజ్ బిల్డింగ్స్ అధికంగా దర్శనమిస్తున్నాయి. దానికి తోడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా ఇటు వైపే ఉండడం కూడా కారణం. అందుకే డిమాండ్ అధికంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed