వీలైనంత తర్వగా జీతాలు చెల్లించనున్నట్టు పైలట్లకు 'గోఫస్ట్' హామీ!

by Vinod kumar |
వీలైనంత తర్వగా జీతాలు చెల్లించనున్నట్టు పైలట్లకు గోఫస్ట్ హామీ!
X

న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న ప్రముఖ విమానయాన సంస్థ గోఫస్ట్ ఇటీవల కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు డీజీసీఏ నుంచి అనుమతి పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా జీతాలను చెల్లించనున్నట్టు తన పైలట్లకు హామీ ఇచ్చింది. గత వారాంతం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) గోఫస్ట్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు షరతులతో కూడిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 15 విమానాలతో 114 సర్వీసులు నడిపేందుకు అవకాశం కల్పించింది. మే 2న కార్యకలాపాలను నిలిపేసిన గోఫస్ట్ మే, జూన్ నెలల్లో పైలట్లకు జీతాలు చెల్లించలేదు.

అలాగే, సంస్థలోని కెప్టెన్, ఫస్ట్ ఆఫీసర్‌లు వెళ్లిపోకుండా రూ. లక్ష, రూ. 50 వేల చొప్పున రిటెన్షన్ బోనస్‌లను అందించింది. తాజాగా విమానాలు నడిపేందుకు అనుమతి రావడంతో జీతాలను సవరించామని, కంపెనీ టీమ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసినట్టు కంపెనీ వెల్లడించింది. జీతాలను వీలైనంత త్వరలో ఇవ్వనున్నట్టు గోఫస్ట్ ఫ్లైట్ ఆపరేషన్స్ వైస్-ప్రెసిడెంట్ రజిత్ రంజన్ అన్నారు. కాగా, నిధుల కొరత కారణంగా ఈ ఏడాది మే మొదటివారంలో గోఫస్ట్ సంస్థ తన విమాన సర్వీసులు నిలిపేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న సంస్థ సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు పునరుద్ధరణ ప్రణాళికను డీజీసీఏకు సమర్పించింది. దీనికి డీజీసీఏ ఆమోదం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed