16 నెలల గరిష్టానికి పెరిగిన టోకు ద్రవ్యోల్బణం

by S Gopi |
16 నెలల గరిష్టానికి పెరిగిన టోకు ద్రవ్యోల్బణం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో టోకు ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూన్ నెలకు సంబంధించి 16 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ఆహార పదార్థాలు, ముఖ్యంగా కూరగాయలు, తయారీ వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో గత నెల టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.36 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం పైకి ఎగబాకడం ఇది వరుసగా నాలుగో నెల. అంతకుముందు మే నెలలో డబ్ల్యూపీఐ సూచీ 2.61 శాతంగా ఉంది. గతేడాది జూన్‌లో ఈ ద్రవ్యోల్బణం 4.18 శాతం ప్రతికూలంగా నమోదైంది. సమీక్షించిన నెలలో ఆహార పదార్థాలతో పాటు ఆహార ఉత్పత్తుల తయారీ, ముడి పెట్రోలియం, సహజవాయువు, ఖనిజ నూనె, ఇతర తయారీ ధరలు పెరిగాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటనలో తెలిపింది. మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. గత నెలలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 10.87 శాతం పెరిగింది. అంతకుముందు మే నెలలో ఇది 9.82 శాతంగా ఉంది. కూరగాయల ద్రవ్యోల్బణం 38.76 శాతంగా ఉంది.

Advertisement

Next Story