Aluminum: చైనీస్ అల్యూమినియం రేకు దిగుమతులపై సుంకం ప్రతిపాదన

by Harish |   ( Updated:2024-08-31 13:10:27.0  )
Aluminum: చైనీస్ అల్యూమినియం రేకు దిగుమతులపై సుంకం ప్రతిపాదన
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తగినంత అల్యూమినియం రేకు ఉత్పత్తి ఉన్నప్పటికీ కూడా చైనా నుంచి దిగుమతులు పెరగడంపై దేశీయ ఉత్పత్తిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చైనా నుంచి దిగుమతి చేసుకునే అల్యూమినియం రేకుపై సుంకాన్ని విధించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ (డీజీటీఆర్) ఆర్థిక మంత్రిత్వ శాఖకు సూచించింది. ఈ ప్రతిపాదన ద్వారా దేశీయ తయారీ పరిశ్రమకు ముప్పును పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నట్లు డీజీటీఆర్ పేర్కొంది. 5.5 మైక్రాన్‌ల కంటే తక్కువ ఉండే అల్యూమినియం రేకును మినహాయించి, 80 మైక్రాన్ల మందపాటి రేకుపై మెట్రిక్ టన్నుకు $619 నుంచి $873 మధ్య సుంకాన్ని సిఫార్సు చేసింది.

భారత్‌లో అల్యూమినియం రేకును ఆహార పదార్థాలను సంరక్షించడానికి ప్యాకేజింగ్ మెటీరియల్‌గా ఉపయోగిస్తారు. స్థానికంగా తగినంత తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, చైనా నుంచి అల్యూమినియం రేకు దిగుమతులు భారతీయ మార్కెట్లో దాదాపు 30% వాటాను సొంతం చేసుకున్నాయి . చైనా దిగుమతులు తమ వ్యాపారాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయని హిందాల్కోతో సహా కొన్ని ప్రముఖ భారతీయ అల్యూమినియం తయారీదారులు డీజీటీఆర్‌ను సంప్రదించారు.

అయితే ఈ సుంకం కారణంగా లోకల్‌గా ధరలు పెరిగే అవకాశం ఉందని కొంతమంది వాదిస్తుండగా, డీజీటీఆర్ చేసిన ప్రతిపాదనపై తుది నిర్ణయం ఆర్థిక మంత్రిత్వ శాఖ చేతుల్లో ఉంది. దిగుమతి సుంకాల నుండి వచ్చే అదనపు ఆదాయాలు 'మేక్ ఇన్ ఇండియా' చొరవను పెంచుతాయి, మరిన్ని స్థానిక ఉద్యోగాలను సృష్టించగలవని చాలా మంది నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed