Stock market: వరుసగా ఐదో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

by S Gopi |
Stock market: వరుసగా ఐదో రోజు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. రికార్డు గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణకు తోడు తాజాగా కేంద్ర బడ్జెట్‌లో కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు సూచీలు క్రమంగా బలహీనపడుతున్నాయి. గురువారం ట్రేడింగ్‌లోనూ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడం, మూలధన లాభాలపై ప్రభుత్వం పన్ను పెంచిన నేపథ్యంలో మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి అధికం కావడంతో స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు క్షీణించాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన తర్వాత కీలక బ్లూచిప్ స్టాక్స్ మద్దతుతో అధిక నష్టాల నుంచి గట్టెక్కాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 109.08 పాయింట్లు నష్టపోయి 80,039 వద్ద, నిఫ్టీ స్వల్పంగా 7.40 పాయింట్ల నష్టంతో 24,406 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, ఫార్మా, మీడియా రంగాలు రాణించగా, మెటల్, బ్యాంకింగ్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, ఎల్అండ్‌టీ, సన్‌ఫార్మా, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. యాక్సిస్ బ్యాంక్, నెస్లె ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.79 వద్ద ఉంది.

Advertisement

Next Story