ప్రభుత్వ రంగ సంస్థలపై మారుతీ సుజుకి ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు!

by srinivas |
ప్రభుత్వ రంగ సంస్థలపై మారుతీ సుజుకి ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా ఛైర్మన్ ఆర్ సి భార్గవ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు అసమర్థమైనవని, అంతేకాకుండా అవి సొంతంగా అభివృద్ధి చెందేందుకు కావాల్సిన నిధులను సమకూర్చుకోలేవని అభిప్రాయపడ్డారు. అందుకే ప్రభుత్వాలు వ్యాపారాలను నిర్వహించకుండాదన్నారు. ఆదివారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ రంగ సంస్థలకు వచ్చే నిధులన్నీ ప్రభుత్వం నుంచే వస్తాయని, వాటికి అన్నివేళలా మద్దతు అవసరం ఉంటుందని భార్గవ పేర్కొన్నారు.

ప్రభుత్వం వ్యాపారంలో ఉండకూడదనడంతో తనకు ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వం నిర్వహించే కంపెనీలు సమర్థవంతంగా లేవు. వాటికి ఉత్పాదకత లేదు, లాభాలను సాధించలేవు, వనరను సృష్టించలేవు, తద్వారా అభివృద్ధి చెందలేవని, అలాంటి సంస్థలు ఎదగడానికి ప్రభుత్వ సాయం అవసరమవుతూ ఉంటుందని భార్గవ వివరించారు. సొంత వనరుల ఆధారంగా అభివృద్ధి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కువేమీ లేవు. పారిశ్రామిక వృద్ధి అనేది అంతరగత వనరులను బలోపేతం చేయగలిగితేనే సాధ్యమవుతుంది. ఏదైనా సంస్థ సంపదను సృష్టించగలగాలి, ఉన్న సంపదను కోల్పోకూడదు. ఈ కోణంలో చూస్తే ప్రభుత్వం రంగ సంస్థలు సంపద సృష్టి లక్ష్యాలను అందుకోలేకపోతున్నాయి.

నాణ్యతలేని పనితీరు వల్ల ప్రజల నుంచి వచ్చే పన్నులను అలాంటి సంస్థలో పెట్టుబడి పెడితే దేశమే నష్టాల బారిన పడుతుందని భార్గవ అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థల అతి జోక్యం కూడా ప్రభుత్వం రంగ సంస్థల వెనకబాటుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. రష్యా, జపాన్, ఫ్రాన్స్, యూకే లాంటి దేశాల్లో ప్రభుత్వం రంగ సంస్థలు విఫలమయ్యాయని, ఆ దేశాలు ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి బయటకు వచ్చాయని భార్గవ వెల్లడించారు.

Advertisement

Next Story