అత్యంత విలువైన కంపెనీల జాబితాలో యాపిల్‌ను దాటిన ఎన్విడియా

by S Gopi |
అత్యంత విలువైన కంపెనీల జాబితాలో యాపిల్‌ను దాటిన ఎన్విడియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా మరొక ముందడుగు వేసింది. మార్కెట్ విలువ ప్రకారం బుధవారం కంపెనీ షేర్ 5 శాతానికి పైగా పెరిగి 1,224 డాలర్లకు చేరడంతో కంపెనీ విలువ 3 ట్రిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన కంపెనీగా ఉన్న యాపిల్‌ను ఎన్విడియా వెనక్కి నెట్టింది. యాపిల్ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. అగ్రస్థానంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఉన్న సంగతి తెలిసిందే. ఎన్విడియా జూన్ 7న షేర్లను విభజించాలని నిర్ణయించింది. ఇది రిటైల్ పెట్టుబడిదారులకు తన ఆకర్షణీయంగా మారింది. అందుకే కంపెనీ షేర్లు భారీగా పుంజుకుంటున్నాయి. గత దశాబ్దన్నర కాలంగా యాపిల్ కంపెనీల షేర్లు అమెరికా మార్కెట్లలో ఆధిపత్యం కలిగి ఉన్నాయి. ఇటీవలే దీన్ని ఎన్విడియా షేర్లు సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచే కంపెనీ షేర్ ఏకంగా 154 శాతం పెరిగింది. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో అత్యాధునిక ప్రాసెసర్లకు అధిక డిమాండ్ ఏర్పడమే ఎన్విడియా షేర్ల వృద్ధికి కారణం. దిగ్గజ సంస్థలైన మైక్రోసాఫ్ట్, మెటా ప్లాట్‌ఫామ్స్, ఆల్ఫాబెట్‌లు ఏఐ టెక్నాలజీని వేగంగా విస్తరించే పనిలో ఉన్నాయి. దీనివల్లే గతనెల నుంచి ఈ కంపెనీల స్టాక్ విలువ 30 శాతానికి పైగా పెరిగింది. గురువారం సాయంత్రానికి ఎన్విడియా మార్కెట్ విలువ 3.01 ట్రిలియన్ డాలర్లు ఉండగా, యాపిల్ విలువ 3 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉంది. ఎన్విడియా చిప్స్‌ను కంప్యూటర్లలో గ్రాఫిక్స్ కోసం ఉపయోగిస్తారు. వీటిని ఎక్కువగా కంప్యూటర్ గేమ్స్లో వాడతారు. ఏఐ టెక్నాలజీ విస్తరణకు కంపెనీ తయారు చేసే చిప్స్ ఎంతో కీలకం.

Advertisement

Next Story

Most Viewed