1947లో తులం బంగారం రూ.89.. 2024లో రూ.71 వేలు.. నెక్స్ట్ రూ.80 వేలు..!

by Harish |   ( Updated:2024-04-06 12:49:22.0  )
1947లో తులం బంగారం రూ.89.. 2024లో రూ.71 వేలు.. నెక్స్ట్ రూ.80 వేలు..!
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు ప్రస్తుతం రోజు రోజుకు పరుగులు పెడుతుంది. గత కొద్ది కాలంగా అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో దేశంలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్య ప్రజలు ఇప్పుడు బంగారం కొనలేని పరిస్థితులు ఉన్నాయి. శనివారం నాడు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,350, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,290 గా ఉంది. త్వరలో ఇది రూ.80 వేల మార్కును సైతం దాటే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గడిచిన కొద్ది సంవత్సరాల్లోనే బంగారం ధరలు అమాంతం పెరగడం గమనార్హం. 2023 జనవరి 24 క్యారెట్ల బంగారం ధర రూ.55 వేలు కాగా ఏడాది కాలంలోనే అది రూ.16 వేలు పెరిగింది. బంగారంపై పెట్టుబడి పెట్టిన వారు భారీ రాబడిని సొంతం చేసుకునే అవకాశం ఉంది.

బంగారం ధరలు గతంలో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి అంటే 1947వ సంవత్సరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కేవలం 89 రూపాయలుగా ఉంది, 1970 నాటికి అది మూడు అంకెల ధర రూ.184 కు చేరుకుంది, ఆ తర్వాత 1980లో నాలుగు అంకెల ధర రూ.1,333కు చేరుకుంది. క్రమంగా ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్న ధర 1990 లో రూ.3,200 గా ఉంది. 2005లో ధర రెండింతల కంటే ఎక్కువ అయి రూ.7000గా నమోదైంది.

2010 నుంచి ధరల సూచీ ఆకాశం వైపు పరుగులు తీసింది. ఆ సమయంలో బంగారం ధర రూ.18,500లకు చేరింది. అప్పటి నుంచి బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు ధరలకు చేరుకుంటూనే ఉంది. కేవలం ఐదేళ్లలో 2015లో ధర రూ.26,345కు పెరిగింది. 2020లో గరిష్ట స్థాయి రూ.48 వేల మార్కును దాటింది. ఆ తర్వాత ఏడాది 2021 లో నిలకడగా ఉన్న బంగారం ధర 2022లో రూ.52 వేలకు చేరడం గమనార్హం. 2023లో రూ.58 వేల మార్కును దాటగా, ఇప్పుడు 2024 ప్రారంభ నెలల్లోనే రూ.71 వేల మార్కును దాటింది. త్వరలో ఇది రూ.80 వేలకు చేరే అవకాశం ఉంది.




Advertisement

Next Story