రుణ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్!

by Hamsa |
రుణ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్!
X

ముంబై: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను పెంచేసింది. సోమవారం నుంచే అమల్లోకి వచ్చే విధంగా అన్ని కాలవ్యవధులపై నిధుల వ్యయ ఆధారిత రుణ రేటు(ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. బ్యాంకు నిర్ణయంతో గృహ రుణంతో పాటు వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వినియోగదారులు చెల్లించే నెలవారీ వాయిదా(ఈఎంఐ)లు మరింత భారం కానున్నాయి. మే నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రుణ రేట్లు పెంచడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.40 శాతం పెంచడంతో, బ్యాంకులు కూడా రుణ రేట్లను పెంచుతున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తాజా పెంపుతో వినియోగదారుల రుణాలపై ప్రభావం చూపే ఏడాది కాలవ్యవధి ఎంసీఎల్ఆర్ రేటు 8.10 శాతానికి పెరిగింది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.70 శాతం నుంచి 7.80 శాతానికి, నెల కాలవ్యవధి ఎంసీఎల్ఆర్ 7.80 శాతం, మూడు నెలలకు 7.85 శాతం, ఆరు నెల కాలవ్యవధిపై ఎంసీఎల్ఆర్ రేటు 7.95 శాతం, రెండేళ్లకు 8.20 శాతం, మూడేళ్లకు 8.30 శాతానికి పెంచింది. గత నెలలో బ్యాంకు ఎంసీఎల్ఆర్ రేటును 20 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. అంతకుముందు జూన్‌లో 35 బేసిస్ పాయింట్లు పెంచింది.

Advertisement

Next Story

Most Viewed